- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు..!
- ఆ భయంతోనే కేసీఆర్ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్‌లో వెళ్లిపోయారు
- కేసీఆర్ పై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం
టీఎస్, న్యూస్:రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే పార్లమెంట్ ఎన్నికల తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. త్వరలోనే పార్టీ మిగలదనే భయంతో కేసీఆర్ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్‌లో వెళ్లిపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు తమ పార్టీని జాతీయ పార్టీ గా చెప్పుకున్నారనీ, కానీ ఏ పార్టీ ఇంత తొందరగా కుప్ప కూలలేదని మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.గత నెల 31న పొలం బాట కార్యక్రమంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమేనన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ అబద్దాలను ప్రజలు గమనించాలని కోరారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మిగలదని, కేసీఆర్ కుటుంబసభ్యులు తప్ప భారత్ రాష్ట్ర సమితిలో ఎవరూ మిగలరని ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ చెప్పెవన్ని అబద్ధాలే అన్నారు. 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు గురించి ఆలోచించట్లేదని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఒక్కో ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు. గత ప్రభుత్వం ఎన్టీపీసీకి సహకారం అందించలేదని ఆరోపించిన మంత్రి ఎన్టీపీసీకి సహకరించి ఉంటే 4వేల మెగావాట్ల విద్యుత్ ఉచితంగా వచ్చేదన్నారు. నీటి పారుదల రంగాన్ని నాశనం చేసిన కేసీఆర్‌కు ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత లేదన్నారు.
కమీషన్ల కోసం సరైన ప్లాన్, డిజైన్లు లేకుండా ప్రాజెక్టులు నిర్మించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆ పార్టీ హయాంలోనే కూలిపోయిందన్నారు. కాళేశ్వరం కోసం విద్యుత్ ఖర్చే ఏడాదికి రూ.10వేల కోట్లు అవుతుందన్నారు. ఇంతటితో ఆగని కేసీఆర్.. ప్రాజెక్టును కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు ఒప్పుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల్లో నీళ్లు తక్కువ ఉండడానికి వర్షాభావ పరిస్థితులే కారణమన్నారు. రూ.45వేల కోట్ల అప్పులతో చేపట్టిన మిషన్ భగీరథ కమీషన్ల భగీరథగా మారిందని ధ్వజమెత్తారు.కేసీఆర్, జగన్ దోస్తీ వల్ల ఆంధ్రప్రదేశ్..అక్రమంగా రోజుకు 10 టీఎంసీలు తరలించిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ రోజూ నీళ్లు తరలిస్తున్నా అప్పటి సీఎం కేసీఆర్ మాట్లాడలేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆనాడు నోరు మెదపని ఆయన, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్, జగన్ కలిసి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలపై కుట్ర చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పంట బీమా ఇవ్వలేదని అన్నారు. దేశంలోనే పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పంట బీమాను రద్దు చేశారని, గులాబీ పార్టీ హయాంలో పంట నష్టం జరిగితే పంట బీమా ఇవ్వలేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి దుయ్యబట్టారు.