- నేను ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేస్తే కెటిఆర్‌కు పూనకం వచ్చింది
- కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి
- అసందర్భ ప్రేలాపనలు కెటిఆర్ మానుకోవాలి
- కెటిఆర్ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
తనను బిఆర్‌ఎస్‌లోకి రావాలని ఇబ్బంది పెట్టారని, నా ఫోన్ ట్యాపింగ్ అయిందని కంప్లైంట్ ఇవ్వగానే కెటిఆర్‌కు పూనకం వచ్చిందని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలిసి విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం తాను ఫిర్యాదు ఇస్తే పరువునష్టం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇంకా అధికారంలోనే ఉన్నానని కెటిఆర్ అనుకుంటున్నారని, కెటిఆర్ ఇచ్చిన నోటీస్ చట్టానికి విరుద్ధంగా ఉందన్నారు.
కెటిఆర్ తనను బెదిరిస్తున్నారని తాను ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. కెసిఆర్ కుటుంబంలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని, నాకు అనుమానం ఉందని ఫిర్యాదు ఇస్తే కెటిఆర్ పరువునష్టం నోటీసు ఇచ్చారన్నారు. కెటిఆర్ మాత్రం మా నాయకులపై అనుమానం ఉందని అంటున్నారని, నువ్వు మాత్రం మా లీడర్లపై అనుమానం ఎలా వ్యక్తం చేస్తావ్ అని ఆయన వ్యాఖ్యానించారు. నాకు, జిట్టా, రఘు నందన్‌లకు నువ్వు చేసిన మోసం పరిస్థితి ఏమిటని కేకే మహేందర్ రెడ్డి కెటిఆర్‌ను ప్రశ్నించారు.
కెటిఆర్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కెటిఆర్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారని, సవాల్ విసిరి వెనక్కి పోయే వ్యక్తి కెటిఆర్ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. డ్రగ్స్ విషయంలో ఛాలెంజ్ విసిరి వెనక్కి పోయారని, మీ సవాళ్లను ఎవరు నమ్మరని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో మాట్లాడిన వాళ్లకు నోటీసులు ఇస్తున్నామని, జడ్జీల ఫోన్‌లు కూడా ట్యాపింగ్ చేశారని, కెటిఆర్ నిజస్వరూపం బయట పడిందని ఆయన అన్నారు. అసందర్భ ప్రేలాపనలు మానుకోవాలని కెటిఆర్‌కు ఆయన సూచించారు.
బిజెపితో పొత్తు కోసం వెంపర్లాడటం నిజం కాదా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు మీ వెంట లేరు, మీరు ఇంకా ఆ భ్రమల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాస్తవాలు బయటపడుతున్నా కెటిఆర్ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కెసిఆర్ పాపాల పుట్ట మేడిగడ్డ రూపంలో పగిలిందని ఆయన దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కాగానే ఆరు గ్యారంటీల్లోని మిగతా హామీలు అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.