-
ఈసారి పెరుగనున్న హెలికాప్టర్ చార్జీలు
-
40 శాతం అధికమయ్యే అవకాశం
-
విమాన ఛార్జీ గంటకు రూ. 4.5 -నుంచి 5.25 లక్షలు
-
డబుల్ ఇంజన్ హెలికాప్టర్ గంటకు రూ.2.75 లక్షలు
రానున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి పలు పార్టీల నాయకులు హెలికాప్టర్‌లను అధికంగా వినియోగించే అవకాశం ఉందని ఏవియేషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు సుడిగాలి పర్యటనల కోసం ఈ హెలికాప్టర్లను వినియోగించాలని ఆయా పార్టీల నాయకులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. గతఅసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రెండు నుంచి నాలుగు హెలికాప్టర్లను వినియోగించాయి. కెసిఆర్ 100 సభలకు, రేవంత్‌రెడ్డి 80 సభలకు ఈ హెలికాప్టర్‌లను వినియోగించినట్టుగా తెలిసింది. గత ఎన్నికల సమయాల్లో సిఎంలు, పార్టీ అధ్యక్షులు, కేంద్ర మంత్రుల స్థాయిలు మాత్రమే వీటిని వాడేవారు. ఈసారి మంత్రులు, ముఖ్య నాయకులు సైతం హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే పలు పార్టీల నాయకులు హెలీక్యాప్టర్‌లను ముందస్తుగా ఎన్నికల ప్రచారం అయిపోయే వరకు బుకింగ్ చేసుకున్నట్టుగా తెలిసింది.
ఫిక్స్‌డ్-వింగ్ విమానాలతో పోలిస్తే హెలికాప్టర్లకు బుకింగ్ ఎక్కువ….
రెండుమూడు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువడనుంది. దాంతో నేతల ప్రచారాలు మరింత ఊపందుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ జెట్లు, హెలికాప్టర్లకు డిమాండ్ గతంకన్నా ఈసారి 40 శాతం పెరిగే అవకాశం ఉందని ఏవియేషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫిక్స్‌డ్-వింగ్ విమానాలతో పోలిస్తే హెలికాప్టర్లకు అధిక గిరాకీ ఉండే అవకాశం ఉందని మారుమూల ప్రాంతాలకు సైతం సులభంగా చేరుకునే అవకాశం ఉండటం వల్లే హెలికాప్టర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
హెలికాప్టర్‌కు గంటకు రూ. 1.5 లక్షలు
ఛార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్ సేవలకు ఛార్జీలను గంటల లెక్కన వసూలు చేస్తారు. విమాన ఛార్జీ గంటకు రూ. 4.5 -నుంచి 5.25 లక్షల వరకు, సింగిల్ ఇంజన్ హెలికాప్టర్‌కు గంటకు రూ. 1.5 లక్షల వరకు వసూలు చేస్తారు. 2023 డిసెంబర్ నాటికి దేశంలో 112 నాన్-షెడ్యూల్ ఆపరేటర్లు ఉండగా ఈ కంపెనీలు అవసరాన్ని బట్టి విమాన సేవలు అందిస్తుంటాయి. ఈ సంస్థలు స్థిరంగా ఒక మార్గంలో సర్వీసులను నడుపవు. ఈ సంస్థల దగ్గర దాదాపు 350 విమానాలు, 175 వరకు హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పది కంటే తక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్నవే.
ఈసారి గరిష్టంగా గంటకు రూ.3.5 లక్షలు
ఈసారి గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్లకు గరిష్టంగా గంటకు రూ. 3.5 లక్షల వరకు చెల్లించడానికి కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 2019-,20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆడిట్ అకౌంట్లలో హెలికాప్టర్లు, విమానాల సేవలకు రూ. 250 కోట్ల వరకు వెచ్చించినట్లు అధికార బిజెపి తెలపగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార ప్రయాణ ఖర్చుల కింద అదే సంవత్సరం రూ. 126 కోట్లను అద్దె రూపంలో చెల్లించినట్టు తెలిపింది.
పైలట్‌తో పాటు ఐదుగురు ప్రయాణించే వీలు
సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ ధర గంటకు రూ.1.5 లక్షలు నడుస్తోంది. తెలంగాణలో హెలికాప్టర్లను అద్దెకు ఇచ్చే పేరొందిన సంస్థలు లేకపోవడంతో రాజకీయ పార్టీలు బెంగళూరు, ముంబై, ఢిల్లీలోని సంస్థలను సంప్రదించి అద్దెకు తీసుకుంటున్నాయి. గంటకు సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ ధర రూ.1.5 లక్షల నుంచి మొదలవుతుంది. అదే డబుల్ ఇంజన్ అయితే గంటకు రూ.2.75 లక్షలు పలుకుతోంది. రోజువారీ అద్దె ప్రాతిపదికన కావాలంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు రూ.10 లక్షలుగా నడుస్తోంది. అద్దె ధరలు ప్రియమైనా ఎన్నికల్లో గెలవాలనే తలంపుతో పార్టీలు ఖర్చుకు వెనకాడడం లేదు.
అయితే హెలికాప్టర్లను వాడాలనుకునే పార్టీలు సీఈసీ అనుమతి తీసుకోవాల్సిందే. అద్దెకు ఇచ్చే సంస్థ, పైలెట్ల వివరాలు తదితర సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు అందజేయాలి. అద్దెకు ఇచ్చే సంస్థలు లైసెన్స్ పొందినవై ఉండాలి. పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) అనుమతి పొందాలి. వీటిని కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనుమతి సమాచారాన్ని హెలికాప్టర్ బయలుదేరే ప్రాంతం నుంచి దిగే ప్రాంతం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, ఎస్పీ, కమిషనర్‌కు సమాచారం ఇస్తారు. ఆ ప్రకారం హెలికాప్టర్ టేకాఫ్, ల్యాండింగ్ కోసం పోలీసు యంత్రాంగం హెలీప్యాడ్లను ఏర్పాటు చేస్తుంది. హెలికాప్టర్ బయలుదేరే సమయంలో దానికి ఇంధనం పూర్తిగా ఉందా లేదా తనిఖీ చేశాకే అనుమతి లభిస్తుంది. ఇందులో పైలెట్‌తో పాటు ఐదుగురు ప్రయాణించే వీలుంటుంది. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు డబుల్ ఇంజన్ హెలికాప్టర్లనే విధిగా వాడాలి. ఖర్చు పార్టీ అభ్యర్థి ఖాతాలోనే నమోదవుతుంది.
అద్దెకిస్తున్న బ్లేడ్ ఇండియా, జెట్ సెట్ గో
బ్లేడ్ ఇండియా, జెట్ సెట్ గో, అర్బన్ ఎయిర్ మొబిలిటీ, ఇండియన్ ఫ్లై సర్వీసెస్ వంటి కంపెనీలు హెలికాప్టర్లు, జెట్ విమానాలను అద్దెకి ఇస్తున్నాయి . ప్రైవేటు ఏజెన్సీలతో పాటు సువిధ యాప్ ద్వారా హెలికాప్టర్లు, విమానాలను అద్దెకు తీసుకోవడానికి ఆన్‌లైన్‌లో రాజకీయ నాయకులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారానికి బెల్ 407, ఎయిర్ బస్ హెచ్125, హెచ్ 130 హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటుంటారు. ఈ హెలికాప్టర్లలో ఐదుగురు ప్రయాణం చేయవచ్చు.