-
నేను.. డీజీపీని మాట్లాడుతున్నా
-
రవిగుప్తా పేరుతో సైబర్ నేరగాళ్ల బెదిరింపు కాల్స్
తెలంగాణ డీజీపీ ఫొటోతో కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సప్ డీపీగా డీజీపీ రవిగుప్తా ఫొటో పెట్టి మోసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యాపారవేత్తకు, ఆయన కుమార్తెకు వాట్సప్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. డ్రగ్స్ కేసులో అరెస్టు చేస్తామని తెలిపారు. కేసు నుంచి తప్పించుకునేందుకు రూ. 50 వేలు డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారవేత్త సీపీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పాకిస్తాన్ కోడ్ +92తో వాట్సప్ కాల్ వచ్చినట్లు గుర్తించారు.
మరో కొత్త తరహా మోసం
సైబర్ చీటర్లు రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన నలుగురిని కొత్త తరహాలో మోసం చేశారు. వాట్సాప్ గ్రూపుల్లోని ఫోన్ నంబర్లను హ్యాక్ చేసి, వారి పేరిట గ్రూపుల్లో ఏపీకే ఫేక్ లింకులు షేర్‌చేశారు. తెలిసిన వారే పంపించారని లింక్ ఓపెన్ చేయగానే వారి ఖాతాల్లోని డబ్బు మాయమైంది. ఇలా నాలుగు రోజుల్లో నలుగురి ఖాతాల్లో రూ. 3.25 లక్షలు స్వాహా చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన పాల సంఘం అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పేరిట సంఘం వాట్సాప్ గ్రూపులో ఏపీకే లింక్‌ను పంపించారు. ఆయన దీనిని ఓపెన్ చేయగా అతడి ఖాతాలోని రూ. 45,500 మాయమయ్యాయి. అలాగే లింక్‌ను తెరిచిన దండు నరేశ్ ఖాతా నుంచి రూ.44,900, లింగారెడ్డిగారి రాజశేఖర్‌రెడ్డి అకౌంట్ నుంచి రూ.50 వేలు, కోటయ్యగారి లత ఖాతా నుంచి రూ.1.85 లక్షలు ఇలా నాలుగు రోజుల్లో రూ.3.25 లక్షలు లూటీ చేశారు.