పోలీసులను ఆశ్రయించిన విజయశాంతి-ప్రసాద్ దంపతులు
డబ్బుల కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ప్రముఖ సినీ నటి ఎం.విజయశాంతి అలియాస్ రాములమ్మ భర్త ఎం.శ్రీనివాస్ ప్రసాద్‌ను బెదిరింపులకు పాల్పడిన ఘటన రాజకీయ వర్గాలలో కలకలంగా మారింది. తాను అడిగినంత డబ్బులు ఇవ్వాలని, లేదంటే నీ అంతు చూస్తానంటూ చంద్రకిరణ్‌రెడ్డి అనే ఓ వ్యక్తి శ్రీనివాస్‌ప్రసాద్‌ను బెదిరిస్తూ సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు పంపాడు. డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేంతవరకు అతి దారుణంగా చంపేస్తానంటూ ఎమ్మెల్సీ విజయశాంతి భర్తను బెదిరించాడు. ప్రసాద్‌కు నాలుగేళ్ల క్రితం చంద్రకిరణ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చెప్పుకున్నాడు. పని తీరు చూశాక కాంట్రాక్ట్ ఇస్తామని చంద్రశేఖర్‌కు శ్రీనివాస్ ప్రసాద్ చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో అతడితో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా పంపించేశారు.
చంద్రకిరణ్ మాత్రం తాను విజయశాంతి కోసం సోషల్ మీడియాలో పని చేస్తున్నాని చెప్పుకుంటూ పలువురు రాజకీయ ప్రముఖుల వద్ద కాంట్రాక్టులు కుదుర్చుకున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం.. తనకు డబ్బులను ఎప్పుడు చెల్లిస్తారంటూ శ్రీనివాస్ ప్రసాద్‌కు చంద్రకిరణ్ మెసేజ్ చేశాడు. ఎటువంటి ఒప్పందం లేకుండానే చంద్రకిరణ్ డబ్బులు అడగడంతో ఇంటికొచ్చి మాట్లాడాలని శ్రీనివాస్ ప్రసాద్ మెసేజ్‌లో సూచించగా, అతడు రాలేదు. ఇటీవల ‘నాకు డబ్బులు ఇవ్వకపోతే మీ బతుకులు రోడ్డుకీడుస్తా.. కసితీరే వరకు అతి దారుణంగా చంపుతాను’ అంటూ చంద్రకిరణ్ మెసేజ్ ద్వారా బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన విజయశాంతి-శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. డబ్బుల కోసం తమను బెదించించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఎమ్యెల్సీకి బెదిరింపు మెసేజ్‌లు చేసిన వ్యక్తి.. గతంలో విజయశాంతి బిజెపిలో ఉన్నప్పుడు సోషల్ మీడియా పేజీలను మెయింటేన్ చేసేవాడనీ తెలుస్తుంది. అయితే, సదరు వ్యక్తి పని తీరు సక్రమంగా లేకపోవడంతో పక్కకు పెట్టారని సమాచారం. అయినప్పటికీ ఇటీవల కాలంలో చంద్రకిరణ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాననీ, నాకు డబ్బులు కావాలని మెసేజ్ పెట్టడంతో శ్రీనివాస్ ప్రసాద్ చంద్రకిరణ్‌ను ఇంటికి పిలిచినా రాలేదని తెలుస్తుంది.
ఇంటికొస్తే ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేద్ధామనుకున్నా కూడా ఇంటికి రాకపోగా డబ్బులు ఇవ్వకుంటే అంతూ చూస్తానంటూ ఓ సారి, తానే ఆత్మహత్య చేసుకుంటానంటూ మరోసారి బెదిరింపులకు ప్పాడినట్లు తెలుస్తుంది. దీంతో ఈ విషయాన్ని విజయశాంతి-ప్రసాద్ దంపతులు బంజారాహిల్స్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా.. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.