టీఎస్, న్యూస్ :తెలంగాణలో మరో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశానికే అన్నం పెట్టే ముగ్గురు అన్నదాతలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
సిద్దిపేట జిల్లా తోగుట మండలానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్ (48) నాలుగు ఎకరాల పొలంలో వరి పంట వేయగా భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో 7 బోర్లు తవ్వించాడు. రూ. 6 లక్షల వరకు అప్పు కావడంతో పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం లోని ఎర్రచకృ తండాకు చెందిన జాటోత్ శ్రీను (40) మూడున్నర ఎకరాలలో మిరప, రెండెకరాల్లో పత్తి సాగు చేశాడు. మిరప సాగు కోసం రూ. 5 లక్షల వరకు అప్పు చేయగా సాగు నీరు లేక నష్టాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన ఉడుత సంతోష్ యాదవ్ (34) తనకున్న 8 ఎకరాలలో పత్తి సాగు చేస్తుండగా రూ. 35 లక్షల వరకు అప్పు చేశాడు. నీటి కొరత తెగుళ్లతో ఆశించిన పంట దిగుబడి రాలేదు. దీంతో, మనస్తాపం చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు..