ఆహార భద్రత కార్డుల లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ బియ్యం జూన్‌లోనే ఇవ్వనున్నారు. రానున్న వానాకాలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఆహార ధాన్యాల నిల్వ, రవాణాలో ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మూడు నెలల రేషన్ కోటాను లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కోటాను జూన్ 1 నుంచి లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో మూడు నెలల బియ్యం ఒకేసారి అందనున్నాయి.
మూడు నెలల థంబ్, ఐరిష్, గుర్తింపు ఒకేసారి
జూన్ మొదటి నుంచే పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు ఇప్పటికే డీలర్లకు సమాచారం ఇచ్చారు. ఆహార భద్రత కార్డులోని ఒక్కో లబ్ధిదారునికి 6 కిలోల చొప్పున 18 కిలోలు, అంత్యోదయ కార్డు ఉన్న వారికి 35 కిలోల చొప్పున 105 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొప్పున 30 కిలోల బియ్యం ఒకేసారి పంపిణీ చేయనున్నారు. మూడు నెలల సన్నబియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 1 నుంచి 30 వరకు రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేస్తారు. మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నందున కార్డుదారులు డీలర్ వద్ద ఈపాస్ యంత్రంలో మూడుసార్లు బయో మెట్రిక్ లేక ఐరిష్ గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం రవాణా ప్రారంభించినట్లు పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత తెలిపారు. కాగా,
సన్నబియ్యం నిల్వ చేసిన బఫర్ గోదాములకు ప్రత్యేకాధికారులను నియమించారు.