- మృతుల్లో ఎస్సై, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్
- చెరువులో మృదేహాల గుర్తింపు.. ముమ్మర దర్యాప్తు
- కామారెడ్డి జిల్లాలో కలకలం
పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఒకే రోజు ముగ్గురు సిబ్బంది అదృశ్యం కాగా ఇద్దరు చెరువులో విగతజీవులుగా కనిపించారు. ఓ ఎస్సై, లేడీ కానిస్టేబుల్ సహా కంప్యూటర్ ఆపరేటర్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట ఠాణాలో పనిచేస్తోన్న కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్‌గా పని చేస్తోన్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి అదృశ్యం కావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు బుధవారం రాత్రి గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి సమయానికి శ్రుతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. అటు, జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఎస్సై ఆచూకీ కోసం గాలించగా కొద్దిసేపటి తర్వాత ఎస్సై మృతదేహం లభ్యమైంది. గాంధారి మండల కేంద్రానికి చెందిన శ్రుతి బీబీపేటలో పని చేస్తుండగా.. మెదక్ జిల్లాకు చెందిన సాయికుమార్ గతంలో బీబీపేట ఎస్సైగా పని చేసి బదిలీపై భిక్కనూరు వొచ్చారు.
ఎస్సై అక్కడ పని చేసిన సమయంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడిరదని పోలీసులు భావిస్తున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలేంటి.? అసలేం జరిగింది.? అనే దానిపై ఆరా తీస్తున్నారు. భిక్కనూరు ఎస్సై సాయికుమార్ సెల్‌ఫోన్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్విచ్చాఫ్ రావడంతో పోలీసులు ఆయన కోసం ఆరా తీయడం ప్రారంభించారు. అటు, బీబీపేట ఠాణాలో పనిచేస్తోన్న లేడీ కానిస్టేబుల్ శ్రుతి బుధవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్లు స్టేషన్‌లో చెప్పి బయటకు వచ్చారు. మధ్యాహ్నం అయినా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరు గాంధారి మండలం గుర్జాల్‌లో ఉంటున్నారు. అయితే, శ్రుతి స్టేషన్ నుంచి ఎప్పుడో వెళ్లిపోయినట్లు పోలీసులు తెలపడంతో పేరెంట్స్ అధికారులను సంప్రదించారు.
ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ ఆధ్వర్యంలోని బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో
చెరువు వద్ద కానిస్టేబుల్ శ్రుతి సెల్‌తో పాటు బీబీపేటకు చెందిన నిఖిల్ సెల్ కూడా దొరికింది. అలాగే, భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌కు చెందిన చెప్పులు, నిఖిల్ చెప్పులు కనిపించాయి. అనుమానంతో చెరువులో గాలించగా లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ శ్రుతి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎస్సై ఫోన్ స్విచ్చాఫ్ అని వస్తుండడంతో ఆయన ఆచూకీ లభించలేదు. ఏం జరిగి ఉంటుందన్నది అంతుచిక్కడం లేదు. ముగ్గురూ కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్సై సాయికుమార్ మృతదేహం సైతం లభ్యం కావడంతో ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.