తిరుపతి: సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమని వివరించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఏడుకొండల వారికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా? ఓట్ల కోసమే మాట్లాడతామా? నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని ఊహించలేదు. నాకు అన్యాయం జరిగితే బయటకు రాలేదు. తిరుమలలో అపచారం జరుగుతోంది.. సరిదిద్దండి అని గతంలో చెప్పా. పట్టించు కోలేదు. అందుకే 11 సీట్లకే పరిమితమయ్యారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం వేంకటేశ్వరస్వామి’’
‘‘ఇతర మతాలను చూసి నేర్చుకోవాలి. సనాతన ధర్మానికి కొన్ని దశాబ్దాలుగా అవమానం జరుగుతూనే ఉంది. మనం గౌరవం ఇవ్వడంలేదు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే వచ్చా. డిప్యూటీ సీఎంగా, జనసేన అధినేతగా ఇక్కడికి రాలేదు. హిందువుగా.. భారతీయుడిగా ఇక్కడికి వచ్చా. భిన్నత్వంలో ఏకత్వం చూపేది సనాతనధర్మం. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే అవహేళన చేశారు. తిరుమలకు వెళ్తే నా కుమార్తెతో డిక్లరేషన్ ఇప్పించా. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేసి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం (Pawan Kalyan on Sanatan Dharma) కోసం ఏదైనా వదులుకుంటా’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
లౌకికవాదం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారు..
‘‘దేశంలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా చాలా దాడులు జరిగాయి. రాముడిని తిడితే నోరెత్తకూడదు.. మనది లౌకికవాద దేశం అంటారు. ఇతర మతాల్లో వాళ్ల దేవుడిని తిడితే వదిలేస్తారా? లౌకికవాదం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారు. హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు లేదు? సనాతన ధర్మాన్ని సూడో సెక్యులరిస్టులు విమర్శిస్తున్నారు. సనాతన ధర్మం, హిందూ దేవుళ్లను విమర్శించే వారు ఎక్కువయ్యారు. ఇస్లాం దేశాల మాటలు సూడో సెక్యులరిస్టులకు వినపడవు. బంగ్లాదేశ్.. ఇస్లాం రాజ్యంగా ప్రకటించుకున్నా ఎవరూ మాట్లాడరు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలని కొంతమంది అనుకుంటున్నారు.
11 నుంచి ఒక సీటుకు పరిమితం చేద్దాం
‘‘మనం పళ్ల బిగువున బాధను భరించాలా?మన సమాజంలో ఐక్యత లేకపోవడమే దీనికి కారణం. మన మతం గురించి మాట్లాడుకోవాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చాం. ధైర్యం, వీరత్వమే సమాజ వికాసానికి మూలం. హిందూ సమాజాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విభజించారు. హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చింది. సనాతన ధర్మానికి రంగు, వివక్ష లేదు.. ఇదంతా మెకాలే తీసుకువచ్చిన వివక్ష. సనాతన ధర్మానికి హాని తలపెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ సారి ఎన్నికలు వస్తే వారిని 11 నుంచి ఒక సీటుకు పరిమితం చేద్దాం.
పాత ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారు?
తిరుమల ప్రసాదాల్లో నిబంధనల ఉల్లంఘనపైనే మా ఆవేదన. గత ప్రభుత్వంలో తితిదే బోర్డు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తున్నాం. జగన్ హయాంలో ఉన్న తితిదే బోర్డు వైఖరిపైనే మా ఆరోపణలు. వైవీ సుబ్బారెడ్డి హయాంలో రూ.10వేలు తీసుకుని రూ.500లకు రశీదు ఇచ్చేవారు. గత ప్రభుత్వం చేసిన దాంట్లో లడ్డూ ప్రసాదం కల్తీ అనేది చిన్న విషయం. గుమ్మడికాయల దొంగ అంటే మీరు భుజాలు తడుముకుంటున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా తిట్టే రకం మీరు. దర్యాప్తు చేయాలని కోరితే రాజకీయాలు చేస్తున్నామంటున్నారు. మీరు చేసిన పాపాలు ఏమిటో ఆ స్వామివారే చెబుతారు. స్వామివారి నిజరూప దర్శనం జరిగినప్పుడు తెలుస్తుంది. పాత ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారు? ఎందుకు మాట్లాడరు? ఆచారాలు పాటించని వ్యక్తి తితిదే ఈవోగా ఎందుకు ఉన్నారు? సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి ఎందుకు స్పందించరు. జగన్‌పై 29 పెండింగ్ కేసులు ఉన్నాయి.. వాటిలో కొన్ని క్రిమినల్ కేసులు కూడా. ఆలయాలపై దాడులు చేసిన వారిపై మీరు తీసుకున్న చర్యలేంటి. ఐదేళ్లలో వైకాపా అనేక అన్యాయాలు చేసింది’’ అని పవన్ కల్యాణ్ విమర్శించారు.