దేశంలో క్రమంగా గాలి కాలుష్యం పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీలో అయితే కాలుష్యం భారీగా పెరిగింది. కాలుష్య నివారణకు అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా గాలి కాలుష్యం పెరుగుతూనే ఉంది. ఢిల్లీలోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా పొల్యూషన్ పెరుగుతోంది. హైదరాబాద్ లో కూడా గాలి కాలుష్యం ఎక్కువ అయింది. నగరంలో ఇటీవల గాలి నాణ్యతలో గణనీయమైన క్షీణత కనిపిస్తోంది. దీపావళి వేడుకల సమయంలో గాలి కాలుష్యం పెరిగింది. గత 72 గంటల్లో నగరంలో గాలి నాణ్యత బాగా క్షీణించిందని చెబుతున్నారు.
భారీగా బాణసంచా కాల్చడమే దీనికి కారణంగా వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వాయు కాలుష్యం 10% పెరిగింది. కాప్రా, బొల్లారం, పటాన్‌చెరు, సోమాజిగూడ, సనత్‌నగర్ లో గాలి కాలుష్యం పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఆమోదయోగ్యమైన పరిమితి 60 ఉండగా చాలా ప్రాంతాల్లో171పై నమోదు అయింది. సోమాజిగూడలో 105 AQI నమోదు కాగా, న్యూ మలక్‌పేట 335కి చేరుకుంది. U.S. కాన్సులేట్ అబ్జర్వేటరీలో 475 గా నమోదు అయింది.
గాలి కాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలను చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాలుష్యం శరీరంలోని దాదాపు ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. శ్వాసకోశ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అధిక స్థాయి వాయు కాలుష్యానికి స్వల్పకాలిక బహిర్గతం దగ్గు, శ్వాసలోపం, ఛాతీ బిగుతు వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంటున్నారు.అయితే దీర్ఘకాలిక ఎక్స్పోజర్ ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. కాలుష్యం చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వాయు కాలుష్యం పిల్లలలో ఊపిరితిత్తుల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ఇది యుక్తవయస్సు వరకు కొనసాగే దీర్ఘకాలిక ఆరోగ్య పరిణామాలకు దారితీస్తుందని చెబుతున్నారు