రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు ముహూర్తం దగ్గర పడుతోంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభించి అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. దేశంలో 7 దశలలో జరిగిన లోక్ సభ ఎన్నికలతో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం ఆసన్నమైంది. దేశంలోని ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎన్నికల కౌంటింగ్ మంగళవారం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు ఒక రోజు ముందు ఎన్నికల సంఘం సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఓటింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించడం బహుశా ఇదే తొలిసారి. లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగిశాయి. ఈ నెల 4న లోక్‌సభ ఫలితాలు వెలువడే ముందు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, పోస్టల్ బ్యాలెట్‌ల నుంచి ఓట్ల లెక్కింపునకు అనుసరించాల్సిన విధానంపై ఎన్నికల సంఘం ఎన్నికల అధికారులందరికీ లిఖితపూర్వక సలహాను జారీ చేసింది. అలాగే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు, ఉప ఎన్నికలకు సంబంధించిన సూచనలను జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 543 లోక్‌సభ స్థానాలకు మంగళవారం ఓట్ల లెక్కింపు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ కోసం ఈసీ ఇప్పటికే కీలకమైన సూచనలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం కూడా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు), వీవీప్యాట్‌లు, పోస్టల్ బ్యాలెట్‌లకు సంబంధించి అనుసరించాల్సిన ప్రక్రియపై సూచనలు చేసింది.
ఒక్కో హాలులో అసెంబ్లీ నియోజకవర్గాలను లెక్కించి రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటిస్తారు. ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి కౌంటింగ్ రౌండ్ల సంఖ్య ఉంటుంది. ఉదయం 11 గంటల వరకు ఫలితాల సరళి ప్రకటించనుండగా, సాయంత్రం అధికారికంగా తుది ఫలితం వెలువడనుంది. దేశవ్యాప్తంగా లెక్కింపు చేయనుండగా.. రాజకీయ పక్షాలు ఈసారి ఆసక్తిగా ఉన్నాయి. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కానీ, ఇండియా కూటమి మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మడం లేదు. ఎవరి అంచనాలలో వారున్నారు.
రాష్ట్రంలో బీజేపీ ధీమా
రాష్ట్రంలో మెజార్టీ లోక్ సభ సీట్లను గెలుచుకుంటామనే ధీమాతో బీజేపీ ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 4 సీట్లను గెలిచింది. ఈ సారి మరో ఆరు సీట్లు గెలుస్తామని విశ్వాసంతో ఉంది. మొత్తం 10 సీట్లను గెలిచి తెలంగాణ రాష్ట్రంలో బలపడతామని చెబుతోంది. ఇటీవల వచ్చిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీ ధీమాకు కారణం అవుతోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 20 శాతం ఓట్లను బీజేపీ సాధించింది. ఆ సమయంలో 4 సీట్లను గెలుచుకుంది. ఈ సారి ఓటు శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో తమ సీట్లు పెరుగుతాయని బీజేపీ అంచనా వేసింది. రేపు కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని కౌంటింగ్ ఏజెంట్లకు బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఎమరపాటు వద్దని, అలర్ట్‌గా ఉండాలని తేల్చి చెప్పింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది.
కాంగ్రెస్ ఆశలు
రేపు ఎన్నికల కౌంటింగ్ కావడంతో పార్టీల్లో తీవ్ర టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ కంటే ముందు ఉంటామా.. లేదా? అన్న టెన్షన్‌లో బీజేపీ.. ఎక్కడ బీజేపీ ముందుకెళుతుందోనన్న టెన్షన్‌లో కాంగ్రెస్ పార్టీలున్నాయి. సర్వేలు కూడా కాస్త బీజేపీకే అనుకూలంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ ప్రారంభమైంది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉంటుందని సర్వేలు చెప్పడం ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామం. పైగా ప్రభుత్వంపై పల్లెల్లో వ్యతిరేకత ప్రారంభమైందన్న వార్తలు సైతం ఆ పార్టీని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. అయితే, తమ 100 రోజుల పాలనకు లోక్‌సభ ఎన్నికలు రెఫరెండంగా చెప్పుకున్నారు.
సైలెంట్ ఆశల్లో బీఆర్ఎస్
బీఆర్ఎస్కు అనూహ్యంగా లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌పై అంచనాలు పెరిగాయి. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో ఆ పార్టీలో ధీమా పెరిగింది. అయితే, ప్రభుత్వ వ్యతిరేకతతో తమకు కలిసి వస్తాయని ఆశల్లో ఉన్నారు. ఎగ్జిట్‌పోల్స్ ఓ గ్యాంబ్లింగ్ అంటూ కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. పార్లమెంట్లో తమకు ఎక్కువ సీట్లు వస్తాయనే ఆశల్లో ఉన్నారు.