బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్న కవితతో కేసీఆర్ రాయబారం మొదలుపెట్టారు. స్వయంగా కూతురుకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. పార్టీలో తన సంగతి ఏంటో తేల్చాలని పట్టుబట్టిన కవితను బుజ్జగించేందుకు దామోదర రావు, గండ్ర మోహనరావును మంగళవారం ఆమె దగ్గరకు పంపించారు. కవిత వ్యవహారం ఓ కొలిక్కి తీసుకురాకుంటే నష్టం తప్పదనే భావనతో ఇద్దరు రాయబారులను కేసీఆర్ పంపించారు. ‘అంతర్గత విభేదాల కారణంగా పార్టీకి నష్టం జరుగుతుంది. ఎవరికి వారుగా ఉంటే సమస్యలు పెరుగుతాయి. పదవులు, హోదాల విషయంలో తొందరపడొద్దు’ అని కవితకు కేసీఆర్ చెప్పినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. అయితే కేసీఆర్‌తోపాటు ఆ ఇద్దరు రాయబారులు ఎంత చెప్పినా కవిత మెత్తబడలేదని తెలుస్తోంది. పార్టీలో తన ప్రాధాన్యం ఏమిటి? రేపు పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే తనకు ఏ హోదా ఇస్తారు? ఆ సంగతి ఇప్పుడే చెప్పాలని పట్టుబట్టినట్లు సమాచారం. అంతేకాదు ఈ వ్యవహారం ఇప్పుడే తేల్చాలని, లేదంటే తన దారి తాను చూసుకుంటానని మొహంమీదే చెప్పేసినట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది.
నా సంగతి తేల్చండి..
కేసీఆర్ ఆదేశాలతో మొదట ఆ కుటుంబ సన్నిహితుడు, బీఆర్‌ఎస్ ఎంపీ దివికొండ దామోదర రావు కవిత నివాసానికి వచ్చి సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత పార్టీ లీగల్ సెల్ ఇంచార్జ్ గండ్ర మోహన్‌రావు కవిత నివాసానికి చేరుకుని కేసీఆర్ చెప్పిన అంశాలను కవితకు స్పష్టంగా వివరించినట్లు జాగృతి వర్గాలు వెల్లడించాయి. దాదాపు 3 గంటలపాటు ఈ సంప్రదింపుల ప్రక్రియ నడిచినట్లు తెలుస్తోంది. అయినా ఏ మాత్రం మెత్తబడని కవిత.. రెండు, మూడు అంశాలపై చాలా పట్టుదలగా ఉన్నారట. నెక్ట్స్ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని, అప్పుడు తన పరిస్థితి ఏమిటని బలంగా అడిగినట్లు తెలుస్తోంది. ఇక కేసులు తదితర అంశాల గురించి కూడా రాయబారులు కవితతో చర్చించారట. అటు కేసీఆర్‌కు కాళేశ్వరం, ఇటు కేటీఆర్ కు ఈ ఫార్ములా, కవితకు లిక్కర్ స్కామ్ వంటి అంశాలను కూడా లేవనెత్తి.. ఈ వ్యవహారం కొలిక్కి రాకపోతే కుటంబంతోపాటు పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. మరి కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే ఉత్కంఠ రేపుతోంది.