ఛత్తీస్‌గఢ్ ఎదురుకాల్పులు.. మృతుల్లో హల్దార్, రామి
ఒకరిపై 8 లక్షలు, మరొకరిపై రూ.5 లక్షల రివార్డు
మృతదేహాలను గుర్తించిన బస్తర్ ఐజి సుందర్ రాజు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి మావోయిస్టులకు, భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు అగ్రనాయకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం అర్ధరాత్రి మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో భద్రత బలగాలు, మావోయిస్టుల కోసం కొండగావు నారాయణ్‌పూర్ సరిహద్దు అడవుల్లోకి వెళ్లగా గమనించిన మావోయిస్టులు కాల్పులు జరపగా ప్రతిఘటించిన భద్రత బలగాలు ఎదురుకాల్పులు జరుపడంతో ఇద్దరు మావోయిస్టు అగ్రనాయకులు మృతి చెందారు.
మృతి చెందిన వారిలో కమాండర్ హల్దార్, ఏరియా కమిటీ సభ్యుడు రామి మృతి చెందినట్లు బస్తర్ ఐజి సుందర్ రాజు బుధవారం విలేకరులకు సమాచారం అందించారు. హల్దార్, రామి మృతదేహాల వద్ద ఏకె47 స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వారి వద్ద నుంచి భారీగా మందుగుండ్లు సామగ్రిని స్వాధీనపరచుకున్నారు. హల్దార్ తలపై రూ.8 లక్షలు, రామి పై రూ.5 లక్షలు రివార్డు ఉన్నట్లు ఐజి పేర్కొన్నారు. ఇప్పటివరకు 140 మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో బస్తర్ డివిజన్‌లోని 123 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఐజి సుందర్ రాజు పేర్కొన్నారు.