సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టిపిసిసి కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల ఫిర్యాదుల పరిష్కారానికి శనివారం టిపిసిసి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్‌లతో ఈ కమిటీని నియమించింది. కాగా, శుక్రవారం జరిగిన ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య ఏర్పడ్డ అభిప్రాయ బేధాలు, ఫిర్యాదులు పరిష్కారానికి ఈ కమిటీ వేయాలని టిపిసిసి నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో నాయకులకు ఎలాంటి ఫిర్యాదులు ఉన్న కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి సూచించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించేది లేదని సిఎం తేల్చి చెప్పారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని ఏ విషయమైనా కమిటీకి ఫిర్యాదు చేయాలని సిఎం సూచించారు. ఎలాంటి ఫిర్యాదులు అయినా విని పరిష్కరించడానికి పార్టీ సిద్ధంగా ఉందని చెప్పిన ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురితో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు టిపిసిసి తెలిపింది.