Wednesday, September 18, 2024

తెర వెనుక బిజెపి, బిఆర్‌ఎస్‌లు ఒక్కటే

  • ఎన్నికలప్పుడే డ్రామాలు ఆడతారు
  • టిపిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామ రాంమ్మోహన్ రెడ్డి

తెర వెనుక బిజెపి, బిఆర్‌ఎస్‌లు ఒక్కటేనని, ఎన్నికలప్పుడే డ్రామాలు ఆడతారని టిపిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామ రాంమ్మోహన్ రెడ్డి అన్నారు. కవిత విడుదలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన ఆయన బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో భాగంగా కవిత అరెస్ట్ జరిగిందే తప్ప, బిజెపి, బిఆర్‌ఎస్‌లపై చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోలేదన్నారు. పదేళ్లుగా రాష్ట్ర వనరులను కొల్లగొట్టిన బిఆర్‌ఎస్ నాయకుల మీద బిజెపి ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. కానీ, ఎన్నికలప్పుడు ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి బిఆర్‌ఎస్ చేసిన అక్రమాలు తన టేబుల్ మీద ఉన్నాయని ఇదో పెద్ద అవినీతి కుటుంబమని, దేశ రాజకీయాలకే డబ్బు పంపించేంత అవినీతి చేసిందని చెప్పినట్లు గుర్తు చేశారు.

అయినా బిఆర్‌ఎస్ పై చర్యలు తీసుకోదని, ఎందుకంటే తెర వెనుక బిజెపి, బిఆర్‌ఎస్‌లు ఒక్కటేనని, ఈ రెండింటికీ కామన్ శత్రువు కాంగ్రెస్ పార్టీ అని, ఎన్నికలప్పుడే ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. కవిత బెయిల్ మీద బయటకు వస్తుందని, బిజెపి, బిఆర్‌ఎస్‌లు ఒక్కటి కాబోతున్నాయని మొన్ననే రేవంత్ రెడ్డి కూడా చెప్పారని ఆయన గుర్తు చేశారు. బిజెపికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత పాలనలో అవినీతి చేసిన బిఆర్‌ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో చేసిన అవినీతి అక్రమాలపై కల్వకుంట్ల కుటుంబం మొత్తం ఊచలు లెక్కబెట్టాల్సిన అవసరం ఉందని, ఊచలు లెక్కబెట్టబోతున్నారన్న నమ్మకం కూడా తనకు ఉందని, ఈ విచారణలను అడ్డుకునే కృషి బిజెపి కచ్చితంగా చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అలా చేయకుంటే బిజెపి వద్ద ఉన్న ఆధారాలతో బిఆర్‌ఎస్ నాయకులపై కేసులు పెట్టి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని రాంమ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular