- పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను ప్రజలు డకౌట్ చేశారు
- రానున్న రోజుల్లో బిఆర్‌ఎస్‌కు రిటైర్‌మెంట్ తప్పదు
- టిపిసిసి మీడియా కోఆర్డినేటర్ సామ రాంమ్మోహన్ రెడ్డి
రాష్ట్రాన్ని కొల్లగొట్టిన బిఆర్‌ఎస్ చీకటి చరిత్ర నచ్చకనే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారని, అయినా బుద్ది మార్చుకోకుండా మాట్లాడుతున్నారని, దీంతో ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను డకౌట్ చేశారని టిపిసిసి మీడియా కోఆర్డినేటర్ సామ రాంమ్మోహన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల సహనాన్ని పరీక్షిస్తే రాబోయే రోజుల్లో రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్ అవుతారని ఆయన హెచ్చరించారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిఎం రేవంత్ అసమర్థుడు అంటూ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. గత సిఎం కెసిఆర్ అసమర్థత వల్లే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, ప్రతిపక్ష నాయకుడిగా కూడా కెసిఆర్ అసమర్థుడిగా మారారని ఆయన దుయ్యబట్టారు.
టూరిస్టులా అమెరికా నుంచి వచ్చిన కెటిఆర్ వచ్చి రాగానే వరద బాధితులను పరా మర్శించకుండా ఆంధ్రా ప్రజలను అవమానించిన పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలను, విష ప్రచా రాలను నమ్ముకొని ముందుకు వెళ్తున్న బిఆర్‌ఎస్ పార్టీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. మా నాయకుల సహనాన్ని పరీక్షించ వద్దని, దేనికైనా ఓ హద్దు ఉంటుందని ఆయన హెచ్చరించారు. కల్వకుంట్ల కుటుంబం ట్రాప్‌లో పడకండి, ఎన్నికలకు ముందు బేసిన్లు లేవు బేషజాలు లేవని చెప్పిన బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు అధికారం దూరం కాగానే ఆంధ్రోళ్లు బ్రతకడానికి వచ్చినవాళ్లు అంటూ మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.