- ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒక ఓటును మాత్రమే కలిగి ఉండాలి
- వెంటనే ఈ విషయంలో ఈసీ చర్యలు చేపట్టాలి
- టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్
ఎపికి చెందిన కొంతమందికి హైదరాబాద్‌తో పాటు ఎపిలోనూ ఓట్లు ఉన్నాయని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలని, కానీ, హైదరాబాద్‌లో బోగస్, డూప్లికేట్ ఓట్లతో పాటు మృతులకు ఓట్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై ఎన్నికల కమిషన్ చెక్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలోనే తాము ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకొచ్చినట్లు ఆయన గుర్తుచేశారు.
అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం తగ్గిందన్నారు. హైదరాబాద్‌లో 0.7 శాతం పోలింగ్ తగ్గిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ తక్కువ జరగడానికి కారణాలపై ఈసీ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే ఆంధ్ర, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఓట్లు వేసిన వాళ్లకు హైదరాబాద్‌లో ఓటుహక్కును తొలగించాలన్నారు. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, జీహెచ్‌ఎంసి ఎన్నికలు కూడా రాబోతున్నాయని, వెంటనే ఆ ఓట్లను తొలగిస్తే రానున్న ఎన్నికల్లో అవకతవకలు జరిగే ఛాన్స్ ఉండదని ఆయన అన్నారు.