- కాంగ్రెస్ చరిత్ర కెటిఆర్‌కు తెలియదు
- టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్‌కు పొలిటికల్ కోచింగ్ ఇప్పించాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ చరిత్ర కెటిఆర్‌కు తెలియదన్నారు. దేశం కోసం రాజీవ్ గాంధీ మిలిటెంట్ల చేతిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారని అది ఎవరూ చెరపలేని చరిత్ర అని జగ్గారెడ్డి అన్నారు. అధికారం కోల్పోయిన బాధలో కెటిఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు కూడా అర్థం కావడం లేదని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. సచివాలయం ముందు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఓ మాజీ ప్రధాని విగ్రహాన్ని పెడితే బిఆర్‌ఎస్ నాయకులకు ఇంత అక్కసు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటికైనా ఏం ఆలస్యం కాలేదని కెటిఆర్‌కు కెసిఆర్‌లకు రాజకీయంగా శిక్షణ ఇస్తే మంచిదని జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో మళ్లీ బిఆర్‌ఎస్ వచ్చే అవకాశమే లేదని జోస్యం చెప్పారు. ఢిల్లీ గులామ్‌లు కాంగ్రెస్ లీడర్లు అంటున్నారని, వారిలా కన్నింగ్ నేచర్ తమది కాదని ఆయన అన్నారు.
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం తరువాత ఇదే కెసిఆర్ కుటుంబం కట్టగట్టుకొని సోనియా ఇంటికి వెళ్లలేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎంతగానో కృషి చేశారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ తెచ్చిన టెక్నాలజీతో ఉద్యోగం తెచ్చుకొని ఆయన్ను తిడితే ఏమనాలని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకునే ధైర్యం, దమ్ము వారికి లేదని ఆయన సవాల్ విసిరారు.