రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని పార్లమెంటులో ఉండకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత ఏడాది కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాహుల్‌గాంధీ పార్లమెంటుకు వెళ్లకుండా కుట్రలు చేసిందనీ ఆరోపించారు. ఇప్పుడు కూడా దాడి చేసి అడ్డుకుంటున్నారనీ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేడ్కర్‌ను అవమానపర్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా క్షమాపణ చెప్పేవరకు కూడా రాహుల్‌గాంధీ పోరాటాన్ని ఆపడన్నారు. అమిత్ షాకి రాహుల్ గాంధీకి చాలా తేడా ఉందనీ, రాహుల్ గాంధీ రోజూ దేవుణ్ణి మొక్కుతారు కానీ పబ్లిసిటీ చేసుకోరన్నారు.
అదే బిజెపి లీడర్లు దేవుణ్ణి మొక్కి పబ్లిసిటీ చేసుకుంటారన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేడ్కర్ రాజ్యాంగా వల్లే ప్రధానమంత్రి మోదీ అయినా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అయినా పదవులు అనుభవిస్తున్నారన్నారు. అంబేడ్కర్‌కు రాజ్యాంగ నిర్మాణానికి ప్రోత్సహించింది జవహర్‌లాల్ నెహ్రూ అని, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి అహార్నిశలు కృషి చేస్తుంది నెహ్రూ ముని మనువడు రాహుల్‌గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి ప్రయత్నిస్తోందని, అందుకే, రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణకు పోరాటం చేస్తున్నారన్నారు. బిసిలుగా చెప్పుకొనే మోదీ, అమిత్ షా కూడా అంబేడ్కర్ రాజ్యాంగం వల్లే పదవులు పొందారన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం వేరు భగవంతుడు వేరన్న విషయం అమిత్ షా గుర్తించాలని తెలిపారు. దేవుడు అనేది నమ్మకం ధ్కెర్యం.. భగవంతుడు అనేది వ్యక్తిగత విషయం అన్నారు. రాహుల్‌గాంధీ ఏ పిలుపునిచ్చినా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సిద్ధంగా ఉన్నామనీ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు జగ్గారెడ్డి అన్నారు.
నేడు సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ…
అంబేడ్కర్‌ను అవమానపరుస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. సంగారెడ్డిలోని ఐబి గెస్ట్‌హౌస్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ఉదయం 11గంటలకు భారీ ర్యాలీని నిర్వహించేందుకు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. ఈ నిరసన ర్యాలీకి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జార్జ్ ఒక పత్రికా ప్రకటనలో కోరారు.