Friday, September 20, 2024

సెర్ప్​లో బదిలీ ఫీవర్​

  • పదేండ్లుగా ట్రాన్స్​ఫర్స్​లేవు
  • ఇప్పుడు 40 శాతం అంటున్న సెర్ప్​
  • 100 శాతం బదిలీలు చేయాలంటూ ఉద్యోగుల విజ్ఞప్తి
  • ప్రభుత్వం దృష్టికి బదిలీల వ్యవహారం

ముద్ర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఐకేపీ)లో బదిలీల గందరగోళం నెలకొన్నది. ఈ సంస్థలో 10 ఏండ్ల నుంచి బదిలీలు చేయలేదు. ఒక్క జిల్లాలో కూడా ఈ ప్రక్రియ చేపట్టలేదు. దీంతో ఏండ్ల నుంచి ఏపీడీలు, డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు ఒకేచోట విధుల్లో ఉన్నారు. కొన్నిచోట్ల ఉన్నతస్థాయిలో కొంత విమర్శలు వస్తున్నా.. బదిలీల ప్రక్రియ చేపట్టడం లేదు. ప్రస్తుతం ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో తమ సంస్థలో100% బదిలీలను చేపట్టాలని సెర్ప్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా గ్రామీణ అభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయను కలిసి విన్నవించారు.

100 శాతం చేస్తేనే..!
గ్రామీణాభివృద్ధి, మహిళల ఆర్థికాభివృద్ధిలో సెర్ప్​ ఉద్యోగులదే కీలక పాత్ర. క్షేత్రస్థాయిలో మహిళా సంఘాలను సమన్వయం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే, సెర్ప్​ ఉద్యోగుల విషయంలో 10 ఏండ్ల నుంచి నిర్లక్ష్యమే ప్రదర్శించారు. ఉద్యోగుల బదిలీలు చేయాల్సి ఉండగా.. ఒక్కరిని కూడా ట్రాన్స్​ఫర్​ చేయడం లేదు. దీంతో కొన్నిచోట్ల ఉద్యోగులు, అధికారుల మధ్య కొంత గ్యాప్​కూడా వస్తుంది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సెర్ప్​ ఉద్యోగుల బదిలీలు చేయాలని ప్రభుత్వం కూడా భావించింది. దీనిలో భాగంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం బదిలీలు చేపట్టాలని ఆదేశిస్తూ జారీ చేసిన జీవో ఆధారంగానే.. సెర్ప్​లో కూడా 40 శాతం బదిలీలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. కానీ, పదేండ్ల నుంచి ఒక్క ట్రాన్స్​ఫర్​ కూడా చేయకుండా.. ఇప్పుడు కేవలం 40 శాతం మాత్రమే చేస్తే.. కొంత ఇబ్బందులు ఉంటాయని ఉద్యోగులు భావిస్తున్నారు. దీనిపై సెర్ప్​లో విభేదాలు వచ్చే ప్రమాదముందని కూడా ఉన్నతాధికారులకు విన్నవించారు.

Transfer fever in Serp
సెర్ప్​ బదిలీల అంశంపై తాజాగా మంత్రి సీతక్కను కలిసిన సెర్ప్​ ఉద్యోగుల జేఏసీ.. ఈ బదిలీల అంశంపై వివరించారు. 40 శాతం బదిలీలతో అభాసుపాలయ్యే ప్రమాదముందని వివరించారు. మంత్రి అనుమతి ఇస్తే పూర్తిస్థాయిలో బదిలీలు జరుగుతాయని, ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ కోరారు. అంతేకాకుండా సెర్ప్​సంస్థలో గత 10 సంవత్సరాలుగా బదిలీలు జరగకపోవడంతో సిబ్బంది ఎక్కడికక్కడ నిస్టేజంతో ఉన్నారని, కొన్నిచోట్ల సరైన విధంగా విధులు చేయలేకపోతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

40 శాతం బదిలీలు చేస్తే.. ఉద్యోగులు ఇబ్బందులు పడుతారని, ఫలితంగా విధుల నిర్వహణ భారమవుతుందని వివరించారు. 10 సంవత్సరాలుగా సెర్ప్ సంస్థలో పూర్తిస్థాయి కౌన్సిలింగ్ జరగలేదని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి పేరుతో స్కూల్ యూనిఫామ్ కట్టించడం, వచ్చే ఐదేండ్లలో లక్ష కోట్ల రుణాలు, ఇందిరా క్యాంటీన్ వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్న నేపథ్యంలో సిబ్బందిలో నూతనోత్సాహం నింపేందుకు 40% బదులు 100% బదిలీలు పదోన్నతులు చేపట్టాలని కోరుతున్నారు. తాజాగా మంత్రి సీతక్కను కలిసిన వారిలో సెర్ప్​ జేఏసీ నాయకులు గంగాధర్​, సుదర్శన్, మహేష్. గిరి. మధు. ఈశ్వర్, దుర్గా కృష్ణ ఉన్నారు.

ఒక్కరోజే ఛాన్స్​
సెర్ప్​లో బదిలీల ప్రక్రియను శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 40 శాతం ప్రాతిపదికన అమలు చేసేందుకు అధికారులు నివేదిక సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దానిపై వెంటనే సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులు చర్చించి, 100 శాతం బదిలీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. దీనిపై శుక్రవారం లేదా శనివారం ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉండటంతో.. ఈ విషయంపై దృష్టి పెట్టాలని విన్నవించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos