రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఇందిరమ్మ లాంటి నాయకురాలు, ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఈ దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుతో కలిసి నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా సేవలందించిన ఇందిరాగాంధీ చిరస్మరణీయమని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
నేటికి కూడా అన్ని ప్రభుత్వాలు ఇందిరమ్మ పాలన తీసుకురావాలని ఆదర్శంగా తీసుకొని చిరస్థాయిగా నిలిచార న్నారు. ఈరోజు యువత ముఖ్యంగా మహిళలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఏ విధంగా తమ తమ రంగాల్లో వృత్తి వ్యవహారపరంగా ఎలా ఉండాలో ఇందిరమ్మను చూసి నేర్చుకోవాలన్నారు. దేశ ఐక్యత కోసం జాతీయ భావం, అభివృద్ధి, పేదల పట్ల పూర్తి శ్రద్ధ అన్ని రకాల అంశాలకు ఇందిరాగాంధీ ప్రాధాన్యత ఇచ్చారని ఆమె ఇచ్చిన స్ఫూర్తి గొప్పదని ఆయన కొనియాడారు. అత్యధిక కాలం ప్రధానిగా చేసిన ఇందిరా గాంధీకి కాంగ్రెస్ పక్షాన హైదరాబాద్ కాంగ్రెస్ పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.