Monday, March 10, 2025

కేంద్ర దర్యాప్తు సంస్థలతో బిజెపి విపక్షాలను అణగదొక్కుతోంది

  • రాష్ట్రంలో బిజెపి పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు
  • అధికారం అడ్డం పెట్టుకొని సిబిఐ, ఈడీలతోనే బిజెపి పాలిస్తోంది
  • రాముడిని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు
  • బిజెపి నాయకులపై రవాణా, బిసి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

కేంద్ర దర్యాప్తు సంస్థలతో విపక్షాలను అణగదొక్కాలని బిజెపి ప్రయత్నిస్తుందని, రాష్ట్రంలో బిజెపి పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని రవాణా, బిసి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. అధికారం అడ్డం పెట్టుకొని సిబిఐ, ఈడీలతోనే బిజెపి పాలిస్తోందని మంత్రి ఫైర్ అయ్యారు. రాముడిని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని బిజెపి నేతలపై మంత్రి సీరియస్ అయ్యారు.  శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో రాముడి అక్షింతలు, ఫొటోలు ఇచ్చి ఓట్లు అడగడం దారుణమన్నారు. బిజెపికి దమ్ముంటే ప్రధాని మోడీ ఫొటో పెట్టుకొని ఓట్లు అడగాలని ఆయన సవాల్ విసిరారు.  పదేళ్లలో కేంద్రం తెలంగాణను మోసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణకు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు బిజెపి ఏం చేసిందని మంత్రి ప్రశ్నించారు.  కాంగ్రెస్ వచ్చింది రాష్ట్రంలో వర్షాలు పడక కరువు వచ్చిందంటున్న బిఆర్‌ఎస్‌పైన పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాభావం వల్లే రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో, చెరువుల్లో నీళ్లు లేవని ఆయన స్పష్టం చేశారు. బిజెపి, బిఆర్‌ఎస్ తోడు దొంగల్లా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈనెల 14వ తేదీన దీక్ష చేపడతా

కరీంనగర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో దీక్షకు దిగుతానని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్ వైఫల్యాలపై ఏప్రిల్ 14వ తేదీన దీక్ష చేపడతానని ఆయన తెలిపారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎవరెవరికీ ఇచ్చారో వారినే బిఆర్‌ఎస్ ఓట్లు అడగాలన్నారు. తమవైపు ఒక్క వేలు చూపెడితే, తాము నాలుగు వేళ్లు చూపెడతామన్నారు. ఒక్కటి కూడా వదలమని ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. బిజెపి, బిఆర్‌ఎస్ మాట మార్చే ప్రభుత్వం తమది కాదని ఆయన అన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్‌ది ఓట్ల రాజకీయమని ఆయన అన్నారు. చేనేతలకు బిజెపి ప్రభుత్వం అన్యాయం చేసిందని, తెలంగాణ అమరవీరులను అవమానించిందని మంత్రి పొన్నం దుయ్యబట్టారు. తాము ఇచ్చిన అన్ని హామీలను అమలుచేస్తామని ఆయన స్పష్టం చేశారు.

బిజెపికి ఎజెండా లేదు

ప్రజలకు న్యాయం జరగాలంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రప్రభుత్వం ఒక్క విభజన హామీ నెరవేర్చ లేదని మంత్రి పొన్నం మండిపడ్డారు. 7మండలాలు, విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రాకు అప్పజెప్పా రన్నారు. రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. బిజెపికి ఎజెండా లేదని మంత్రి దుయ్యబట్టారు. మోడీ, అమిత్ షాలు దేశంలో నవరత్నాల కంపెనీలు అమ్ముతున్నారని, బిజెపి దళితులకు, బిసిలకు, మైనారిటీలకు వ్యతిరేకమని మంత్రి పొన్నం ఆరోపించారు. శ్రీరాముడి పేరున అక్షింతలు, కుంకుమ ఇచ్చి ప్రజలను ఓట్లు అడుగుతున్నారని, బిజెపి భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తోందని మంత్రి పొన్నం దుయ్యబట్టారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తాను గెలిచిన సికింద్రాబాద్‌కు ఏమీ చేశారని ఆయన ప్రశ్నించారు. చేనేత కార్మికులకు అండగా ఉన్నది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు.

మిషన్ కాకతీయ నీళ్లు మొత్తం ఎటు పోయాయి?

ప్రకృతి వైపరీత్యాలకు నార్త్ ఇండియాలో ఎలా ఆదుకుంటున్నారో సౌత్ ఇండియాలో కూడా అలాగే ఆదుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. “మిషన్ కాకతీయ నీళ్లు మొత్తం ఎటు పోయాయి? మేం తాగామా, మీరు తాగారా?” అంటూ మంత్రి పొన్నం గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గుర్తింపు కోసమే కొందరు బిజెపి నాయకులు కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com