Tuesday, April 22, 2025

నాటుసారా, గంజాయి రవాణాపై అధికారుల నిఘా

  • సారా తయారీ కేంద్రాలపై వరుస దాడులు చేస్తున్న అధికారులు
  • రాష్ట్రంలోకి అక్రమంగా గంజాయి రవాణా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన
  • ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం 
  • ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్, డైరెక్టర్ వివి కమలహాసన్ రెడ్డి
    ఆదేశాలకు అనుగుణంగా సమర్థవంతంగా విధులు

రాష్ట్రంలో నాటుసారా, గంజాయిని సమూలంగా రూపుమాపాలన్న లక్షంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ముందుకెళుతోంది. ఈ నేపథ్యంలో వీటి రవాణాపై నిఘా పెంచింది. అందులో భాగంగా నాటుసారా, గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టేలా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. అందులో భాగంగా ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్, డైరెక్టర్ వివి కమలహాసన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా నాటుసారా తయారీ కేంద్రాలపై, గంజాయి అక్రమ రవాణాపై అధికారులు తమ సిబ్బందితో కలిసి వరుస దాడులను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలోని నాటుసారాను తయారు చేస్తున్న నిర్వాహకులు, వారి అనుచరులపై వరుసగా కేసులను నమోదు చేయడంతో పాటు వారికి సామగ్రిని విక్రయిస్తున్న దుకాణదారులను అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి తరలిస్తున్న గంజాయిని పట్టుకోవడంలో అధికారులు తమవంతు కృషి చేస్తున్నారు.

రూ. 25 లక్షల నాటుసారా తయారీ బెల్లం
ఇప్పటికే నాటుసారా అధికంగా తయారయ్యే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్లగొండ, వరంగల్ జిల్లాలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యంత్రాంగం నిఘా పెంచింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క రోజులోనే రూ.25 లక్షల నాటు సారా తయారీ బెల్లాన్ని, వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర లాతూర్ నుంచి నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లికి అక్రమంగా తరలివస్తున్నటువంటి 5 లక్షల బెల్లం తో పాటు పదిలక్షల విలువ చేసే ఆలంను పట్టుకున్నారు.

కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న బెల్లం…
ఇదే ఉమ్మడి జిల్లా హైదరాబాద్ నుంచి వనపర్తి జిల్లాలోని కల్వకుర్తి కొల్లాపూర్ ప్రాంతాలకు కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న బెల్లం, ఆలంతో పాటు రెండు వాహనాలను, వ్యక్తులను అరెస్ట్ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తన సిబ్బంది కలిసి దాడులు నిర్వహించి పది లక్షల 83 వేల 700 విలువచేసే బెల్లం ఆలం వాహనాలను స్వాధీనం చేసుకొని నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేశారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సైతం….
గత నెలలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మట్టంపల్లి, చింతలపాలెం, మేళ్లచెర్వు మండలాల్లోని పలు గ్రామాల్లో నల్గొండ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 23 లీటర్ల నాటుసారాతో పాటు300 కిలోల బెల్లం, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎర్రకుంట తండాకు చెందిన బానోతు శ్రీను నుంచి 5 లీటర్లు, బానోతు హనుమ నుంచి 3 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేశారు. చింతలపాలెం మండల కేంద్రంలోని ఓ ఇంట్లో 300 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన చిత్తలూరి లక్ష్మీ సారా విక్రయిస్తుండగా ఆమె వద్ద నుంచి 5 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. మట్టంపల్లి మండలంలోని అవిరేణికుంట తండా, సుల్తానాపూర్ తండా, రామచంద్రపురం తండాల శివార్లలో దాచిన సుమారు 900 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. మట్టంపల్లి మండలం కాల్వపల్లి తండాకు చెందిన బానోతు కోట, బానోతు సోముడు వాహనంపై10 లీటర్ల సారా తరలిస్తుండగా బానోతు కోటను అరెస్టు చేసి ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు.

ఒరిస్సా నుంచి నగరానికి తరలిస్తున్న గంజాయి స్వాధీనం
ఒరిస్సా మాల్కోనగిరి నుంచి హైదరాబాద్ దూల్‌పేట్ ప్రాంతానికి అక్రమంగా రవాణా అవుతున్న 47.5 గంజాయిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆదివారం పక్క సమాచారంతో నిందితులను పట్టుకున్నారు. దూల్‌పేట్‌కు చెందిన ఓ వ్యక్తి ఐరన్ కోర్ సరఫరా చేసే ట్రిప్పునకు రూ.20 వేలు చెల్లిస్తూ నల్లగొండ జిల్లా చిట్యాల వరకు ఆ గంజాయిని తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాడు. చిట్యాల నుంచి మరో లారీలో ఈ గంజాయిని తరలిస్తుండగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి చేసి లారీతో సహా నిందితులను పట్టుకున్నారు. ఈ ఘటనలో రూ.10 లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేసి, లారీ, కారు, ఆటోను సీజ్ చేశారు. ఇప్పటివరకు ఆ స్మగ్లర్ 400 కిలోల గంజాయిని ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా చేసినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com