ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. పులివెందుల నియోజకవర్గ ప్రజలెంతో గర్వంగా ఫీలయ్యేవారు. ఆయన్ని చూసేందుకు పులివెందుల నుంచి ప్రత్యేకంగా సీఎం అధికారిక నివాసం వద్దకొచ్చి కలిసేవారు. దీంతో అందులో అనేకమందిని వైఎస్సార్ గుర్తు పెట్టి.. వారిని పేర్లతో పిలిచేవాడు. ఫలితంగా వారంతా సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యేవారు. అలా పులివెందుల వాసులకు అధికారిక సీఎం గృహంలో ప్రత్యేక మర్యాదలు చేసేవారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అలాంటి పరిస్థితి మచ్చుకు కూడా కనిపించట్లేదని చెప్పొచ్చు. ప్రజలు నేరుగా సీఎం కేసీఆర్‌ని కలవడం దేవుడెరుగు.. అసలు మంత్రులు, ఎమ్మెల్యేలకూ కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వని పరిస్థితి. అలాంటిది గజ్వేల్ వాసుల్ని ఆయనెక్కడ కలుస్తాడు. అందుకే, ఈసారి సీఎం కేసీఆర్ కు రెండు నియోజకవర్గాల్లో.. ప్రతికూల పరిస్థితి ఎదురయ్యే అవకాశముందని ప్రజలు అంటున్నారు. కేసీఆర్‌కు తమ తడాఖా ఏంటో చూపిస్తామని గజ్వేల్, కామారెడ్డి వాసులు సైతం అభిప్రాయపడుతున్నారని సమాచారం. ఏదీఏమైనా, వాస్తవాలేమిటో తెలియాలంటే డిసెంబరు 3వరకూ వేచి చూడాల్సిందే.