Monday, April 21, 2025

అదనపు ఆదాయం కోసం ఎక్సైజ్ శాఖ కృషి

  • అక్రమ మద్యం అడ్డుకట్ట వేయడానికి నిరంతరం నిఘా…
  • మాదకద్రవ్యాలపై స్పెషల్ టీంల ఉక్కుపాదం
  • గుడుంబాను అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ

అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేయడం, గుడుంబాను అరికట్టడం, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపి ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మిగతా రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం రాకుండా అడ్డుకట్ట వేయడానికి ఇప్పటికే ఎక్సైజ్ టీంలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి నెలా సగటున రూ.3,000 కోట్ల విలువైన మద్యం విక్రయిస్తోంది. రాష్ట్రంలో జరిగే మొత్తం మద్యం అమ్మకాల్లో 70 శాతం హైదరాబాద్ సహా పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి మద్యం విక్రయాల ద్వారా మరింత ఆదాయం వచ్చేలా ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా అక్రమ మద్యాన్ని అడ్డుకోవడంతో పాటు గుడుంబా తయారీని పూర్తి స్థాయిలో అరికట్టడం, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపడం లాంటి చర్యలను చేపట్టింది.

రూ.2 వేల కోట్ల అదనపు ఆదాయం
రాష్ట్రంలో యువత జీవితాలను నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు గుడుంబా తయారీని పూర్తి స్థాయిలో అరికట్టడం, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి చొరబడకుండా చర్యలు తీసుకోవడం, కల్తీ కల్లు, గంజాయి, మాదకద్రవ్యాలు లాంటివి రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకట్ట వేయడంపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సరిహద్దు తనిఖీ కేంద్రాలను మరింత పటిష్టం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో అక్రమ మద్యం సరఫరా జరగకుండా నిలువరించడం, గంజాయి రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకట్ట వేయడం లాంటి చర్యలకు పక్కా కార్యాచరణతో ముందుకు వెళుతోంది. అక్రమ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నియంత్రిస్తే ఎక్సైజ్ శాఖ ద్వారా మరో రూ.2,000 కోట్లు అదనంగా ఆదాయం వస్తుందని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.36,500 కోట్ల విలువైన మద్యాన్ని ఎక్సైజ్ శాఖ విక్రయించింది. అయితే అక్రమ దందాలకు అడ్డుకట్ట వేస్తే మరో రూ.2 వేల కోట్లు అదనపు ఆదాయం అబ్కారీ శాఖ ద్వారా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

2023,-24లో రూ.36 వేల కోట్లకు పైగా ఆదాయం
సాధారణంగా ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మద్యం అమ్మకాలపై వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, మద్యం లైసెన్స్ ఫీజు, మద్యం దరఖాస్తులు ద్వారా ఆదాయం పెద్ద ఎత్తున వస్తుంది. 2023-,24 ఆర్థిక ఏడాదిలో మద్యం అమ్మకాలపై వ్యాట్ ద్వారా రూ.14,570 కోట్ల రాబడి రాగా, ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.15,997 కోట్లు ఆదాయం వచ్చింది. ఇవి కాకుండా కొత్తగా మద్యం లైసెన్స్ ఇవ్వడానికి 2023 ఆగస్టులో టెండర్ల ప్రక్రియ ద్వారా 1,31,964 దరఖాస్తులు వచ్చాయి. వీటికి గాను ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షలు రుసుం కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,639 కోట్లు ఆదాయం వచ్చింది.

ఇది కాకుండా మద్యం లైసెన్స్‌లకు ప్రతి ఏడాది దాదాపు రూ.2,000 కోట్లు, బార్లు, క్లబ్లు తదితర లైసెన్స్‌ల ద్వారా మరో రూ.1000 కోట్ల మేర రాబడి వస్తుంది. మొత్తంగా 2023,-24 ఆర్థిక సంవత్సరంలో రూ.36 వేల కోట్లకు పైగా ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది.2023-,24 ఆర్థిక ఏడాదిలో వరుసగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు రావడంతో లిక్కర్ కంటే దాదాపు రెండు కోట్ల కేసుల బీర్ల విక్రయాలు అదనంగా విక్రయించినట్టు ఆబ్కారీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com