రెరా నిబంధనలు ఉల్లంఘించి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ప్రీ లాంచింగ్ కార్యక్రమాలకు పాల్పడితే.. స్థిరాస్తి క్రమబద్ధీకరణ అభివృద్ధి చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని టీఎస్ రెరా హెచ్చరించింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డీటీసీపీ, యుడిఏ, ఇతర స్థానిక సంస్థల అనుమతులతో పాటు.. రెరాలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు విధిగా రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది. ఆతర్వాతే అమ్మకాల నిమిత్తం వ్యాపార ప్రకటనల్ని విడుదల చేయాలని తెలియజేసింది. రెరా రిజిస్ట్రేషన్ పొందని ప్రాజెక్టులను సుమోటో గాను, ఫిర్యాదుల ద్వారా గుర్తిస్తామని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే.. షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రియల్ సంస్థల నుంచి.. ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 10% వరకు అపరాధ రుసుము విధిస్తామని అథారిటీ పేర్కొంది.
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు తమ వ్యాపార ప్రకటనలలో (ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా) లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నెంబరు తోపాటు అథారిటీ వెబ్‌సైట్‌లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు పూర్తి వివరాలు విధిగా నమోదు చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామని అథారిటీ తెలిపింది.
కొనుగోలుదారులకు స్థిరాస్తి కొనుగోలు విషయంలో సరైన సమాచారం అందించి మోసాలకు గురి కాకుండా అప్రమత్తతతో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అథారిటీ పేర్కొన్నది. బిల్డాక్స్ వ్యవహారంలో నిజనిర్థారణ జరిపి చట్టప్రకారం కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకుంటామని తెలియజేసింది. ఈ నెల నాలుగున బిల్డాక్స్‌కు సంబంధించిన విచారణ ఉందని రెరా కార్యదర్శి పి. యాదరెడ్డి తెలిపారు.