- ప్రయాణికులకు అందుబాటులోకి డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసి బస్సులు
- సంవత్సరానికి రూ.365 కోట్ల అదనపు ఆదాయం రాబట్టుకునేలా ఆర్టీసి ప్రణాళికలు
ఆదాయాన్ని మరింత పెంపొందించుకునేలా టిఎస్ ఆర్టీసి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మరిన్ని డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసి బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. తద్వారా ప్రయాణికుల సంఖ్యను మరింతగా పెంచుకోవాలని లక్ష్యంగా ఎంచుకుంది. ఇప్పటికే ఉద్యోగులు, కార్మికులకు ఆర్టీసి మార్చిలో వేతన సవరణ చేసింది. ఈ వేతన సవరణతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై ఏటా రూ.418 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ భారాన్ని తట్టుకునేందుకు వీలుగా టికెట్ ఆదాయాన్ని రోజుకు కోటి రూపాయలను పెంచుకోవాలని సంస్థ లక్ష్యంగా నిర్ధేశించుకుంది.
ఫలితంగా సంవత్సరానికి రూ.365 కోట్ల అదనపు ఆదాయం రాబట్టుకోవాలని ఆర్టీసి భావిస్తోంది. ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఆర్టీసిలో గరిష్ఠంగా రోజుకు 55 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతో ఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి (ఆక్యుపెన్సీ రేషియో- ఓఆర్) 95- నుంచి 120 శాతం వరకు నమోదవుతోంది. స్త్రీలకు ఉచితం లేని సూపర్‌లగ్జరీ, డీలక్స్, ఏసి బస్సుల్లో ఓఆర్ 65- నుంచి 70 శాతం వరకు నమోదవుతోంది. ఈ బస్సుల్లోనూ ఆక్యుపెన్సీని పెంచుకోగలిగితే ఆదాయం పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.
శ్రీశైలం తరహా ప్రయోగాం మరికొన్ని చోట్ల….
దీనికోసం రూట్ల వారీగా అదనపు ఆదాయానికి ఉన్న అవకాశాలను గుర్తించడంపై రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దృష్టి సారించింది. అదేవిధంగా ఆర్టీసి బస్టాండ్ల దగ్గర ప్రైవేటు బస్సులు, ప్రైవేటు వాహనాలు ఆగకుండా చూడటం, డిమాండ్ ఉన్న రూట్లలో డీలక్స్, సూపర్‌లగ్జరీ, ఏసి సర్వీసులను అధికంగా నడపడం వంటి చర్యలు చేపట్టనుంది. హైదరాబాద్ టు -శ్రీశైలం మధ్య గతంలో సూపర్‌లగ్జరీ బస్సులు మాత్రమే ఉండేవి. ఇటీవల ఏసి బస్సులను సంస్థ ప్రవేశపెట్టింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణికులకు కొత్త సౌకర్యంతో పాటు సంస్థకు ఆదాయం పెరిగింది.
ఇదే తరహా ప్రయోగాల్ని మరికొన్ని రూట్లలో చేసేందుకు టిఎస్ ఆర్టీసి కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే టిఎస్ ఆర్టీసి యాజమాన్యం నాలుగు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో వేతన సవరణ అదనపు భారాన్ని ఎలా భరించాలన్న అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. సూపర్‌లగ్జరీ, ఏసి, డీలక్స్ బస్సుల్లో ప్రయాణికులను పెంచుకుంటే రోజుకు రూ.కోటి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆర్టీసి అధికారులు సూచించారు. ఈ దిశగా సమాయత్తం చేసేందుకు డిపోల వారీగా డీలక్స్, సూపర్‌లగ్జరీ, ఏసి బస్సుల కండక్టర్లు, డ్రైవర్లతో భేటీలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.