తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య ఎక్కువగా వివాదాలు జరుగుతున్నాయి. తిరుమలలో ఓ ఉద్యోగిపై బోర్డు సభ్యుడు ఒకరు అందరి ముందు బూతులతో విరుచుకుపడ్డారు. భక్తులు, ఇతర సిబ్బంది ముందే విచక్షణ మరచి బూతులు అందుకోవడంతో అందరూ విస్తుపోయారు.
బోర్డు సభ్యుడు నరేశ్ కుమార్ నిన్న ఉదయం తమ వారితో కలిసి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మహాద్వారం వద్దకు చేరుకున్నారు. గేటు తెరవాలని నరేశ్ కుమార్ సహాయకుడు అక్కడున్న ఉద్యోగి బాలాజీని కోరారు. దానికి ఆయన.. మహాద్వారం గేటు ద్వారా ఎవరినీ పంపడం లేదని, కావాలంటే ఉన్నతాధికారులను కనుక్కోవచ్చని తెలిపారు. ఆ మాటతో నరేశ్ కుమార్ సహనం కోల్పోయారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? అంటూ ఆయనతో వాదనకు దిగారు. ‘నిన్ను ఇక్కడ పెట్టిందెవరు? నా గురించి ఏమనుకుంటున్నావు. నువ్వు బయటకు పోవయ్యా.. థర్డ్ క్లాస్ వ్యక్తులను ఇక్కడ ఎవరు ఉంచారు? వాడి పేరేంటి? అంటూ అసభ్య పదజాలం ఉపయోగించారు.
ఆయన మాటలు విని భక్తులు, ఉద్యోగులు విస్తుపోయారు. స్వామివారి చెంత బూతుపురాణం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి రౌడీలా ప్రవర్తించి బోర్డు సభ్యుడి పదవికి ఉన్న గౌరవ ప్రతిష్ఠలను మంటగలిపారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, గొడవతో అక్కడికి చేరుకున్న టీటీడీ వీజీవో సురేంద్ర, పోటు ఏఈవో మునిరత్నం తదితరులు నరేశ్‌కుమార్‌కు నచ్చజెప్పి మహాద్వారం గేటు ద్వారా బయటకు పంపడంతో గొడవ సద్దుమణిగింది. అధికారంలో ఉంటే వారి క్రింద పనిచేసే వారిని ఇంతలా అవమానిస్తారా… ఈ విధంగా చూస్తారా… థర్డ్‌క్లాస్..ఫస్ట్ క్లాస్ అంటూ తేడాలు చూపిస్తారా అని నెటిజన్లు ఆగ్రహం చెందుతున్నారు.