- నేడు ఉదయం స్వామివారిని దర్శించుకోనున్న ముఖ్యమంత్రి
- మనవడి తలనీలాలు సమర్పించడానికి కుటుంబసమేతంగా తిరుపతికి….
తిరుమల శ్రీవారి దర్శనం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు ఆయన కుటుంబసమేతంగా చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. రచనా అతిధిగృహం వద్ద సిఎం రేవంత్ రెడ్డికి టిటిడి ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. తన మనవడి తలనీలాలు స్వామి వారికి రేవంత్ కుటుంబ సభ్యులు సమర్పించనున్నారు. ఈ రాత్రికి తిరుమల్లోనే రేవంత్ రెడ్డి బస చేయనున్నారు.
నేడు ఉదయం శ్రీవారిని సిఎం రేవంత్‌రెడ్డి దర్శించుకోనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా బాలాజీని ముఖ్యమంత్రి దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం నేడు(బుధవారం) సిఎం రేవంత్‌రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.