Thursday, December 26, 2024

అది తుస్సు బాంబే

మేం ఒరిజ‌న‌ల్ బాంబుల‌కే భ‌య‌ప‌డం
ఏం చేసుకుంటారో చేసుకోండి
బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

రెండు రోజుల నుంచి మంత్రి పొంగులేటీ చెప్పుతున్న‌దంతా ఉత్తిదేన‌ని, ఏం చేసుకున్నా తాము భ‌య‌ప‌డే ప్ర‌సక్తే లేద‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్ర‌వారం పొంగులేటి బాంబులపై మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఒరిజనల్ బాంబులకే భయపడలేదు.. మీరో లెక్కా అంటూ విరుచుకుపడ్డారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కేటీఆర్ స‌వాల్ చేశారు. శుక్రవారం సిరిసిల్లలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ బహిరంగ విచారణకు ఎమ్మెల్యే కేటీఆర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నేతల అరెస్టులు తప్పవని, త్వరలోనే బాంబులు పేలతాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏవో పిచ్చి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఎలాంటి బాంబులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. చంద్రబాబు, వైఎస్‌ఆర్‌ వంటి వారితోనే పోరాటం చేశామని.. మీరో లెక్కా అంటూ విరుచుకుపడ్డారు. పొంగులేటి బాంబులు తుస్సే అంటూ మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు.

మీరేమైనా చేసుకోండి
సియోల్ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నేతలు అరెస్ట్ అవడం పక్కా అని తెలిపారు. గత సర్కారులో కీలక నేతలను నవంబరు 1 నుంచి 8 వరకు అందరినీ అరెస్టు చేస్తామని ప్రకటించారు. త్వరలోనే బాంబులు పేలతాయన్నారు. ఈ నేప‌థ్యంలోనే కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు.
‘‘ఏం పీక్కుంటారో పీక్కోండి.. నీ బాంబులకు భయపడలేదు. కేసులకు భయపడేది లేదు. మేం ఒరిజినల్ బాంబులకే భయపడలేదు. దొంగ కేసులు పెడితే పెట్టుకో. నీ ఈడీ కేసులు, మోడీ కాళ్ళు మొక్కిన బాంబుల గురించి చెప్పు. చంద్రబాబు, వైస్సార్‌తోనే కొట్లాడినం.. ఈ చిట్టి నాయుడు ఓ లెక్కనా. అడ్డమైన కేసులు పెట్టి జైలుకు పంపితే పంపు.. ఆర్‌ఆర్ టాక్స్‌లపై మేం వచ్చాక లెక్క తెలుస్తాం. సీఎం రేవంత్ బామ్మర్ది, పొంగులేటి బాగోతాలు అన్నీ బయటకు తీస్తాం. చావుకు మేం భయపడం’’ అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు.

ఖజానా నింపుకునేందుకే..!
రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని, విద్యుత్‌ను వ్యాపార ధోరణిలో చూడొద్దని తెలిపారు. విద్యుత్ భారం కాదని.. బాధ్యతగా ప్రభుత్వం భావించాలని సూచించారు. పేదల నడ్డి విరిచేలా సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రూ.963 కోట్ల చార్జీలు ప్రజల మీద రుద్దుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజల మీద తాము భారం పడనివ్వలేదని చెప్పుకొచ్చారు. 300 యూనిట్లు దాటితే.. ఒక్క యూనిట్‌కు 50 రూపాయలా.. ప్రభుత్వ ఖజానా నింపుకునేది ఇలాగేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 నెలలుగా పారిశ్రామిక అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రాష్ట్రం మీద 18 వేల కోట్ల భారం మోపుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com