Friday, December 27, 2024

ఒకే గొడుగు కిందికి రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు!

ముహూర్తం ఈనెల 28, వేదిక సుందరయ్య విజ్ఞాన కేంద్రం

సిపిఎంఎల్‌ న్యూడెమోక్రసీ రెండు పార్టీలుగా విడిపోయి రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు అనేక దఫాలుగా చర్చలు జరిపి కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై ఒకే న్యూ డెమోక్రసీ పార్టీగా కొనసాగాలనే ఆలోచనతో ఈ రెండు పార్టీల నేతలు ఈనెల 28న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తాము కలిసిపోతున్నామని ఒకే గొడుగు కింద పని చేసుకుంటామని.. ప్రకటించనున్నారు. అయితే గతాన్ని ఒకసారి నెమరు వేసుకుంటే 1969 లో సిపిఐ ఎంఎల్‌ పార్టీగా ఆవిర్భవించి రాష్ట్రంలో ఒక బలమైన విప్లవ పార్టీగా ఏర్పడిరది. దీనికి సిపి నాయకత్వం వహించాడు. అతని నాయకత్వంలోనే అనేక ఉద్యమాలు కొనసాగించడమే గాక లక్షలాది ఎకరాల పోడు భూములను కొట్టి భూమిలేని పేదలు సాగు చేసుకునే విధంగా ప్రజలకు అండగా ఉన్నారు. భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ప్రతిఘటన పోరాటాలు నిర్మించారు. ప్రజలు లక్షలాదిగా ఈ పార్టీ వెనకాల సమీకృతులయ్యారు. ఈ పార్టీ లీగల్‌, ఇల్లీగల్‌ విధానం ద్వారా ముందుకు సాగుతూ అనేకచోట్ల తమ ప్రజాప్రతినిధులను గెలిపించుకున్న ఘటనలు ఉన్నాయి రెండు చోట్ల ఇల్లందు, సిరిసిల్లలో ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకున్నారు.

ఒకవైపు లీగల్‌ గా అన్ని అవకాశాలను ఉపయోగించుకొని అనేక సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగటం మరోవైపు వైపు సాయుధ దళాలను ఏర్పాటు చేసుకొని పనిచేయటం కొనసాగించింది. రాష్ట్రంలో సీపీ గ్రూప్‌ పీపుల్స్‌ వార్‌ పోటాపోటీగా తమ కార్యపాలను కొనసాగించేవారు. రాష్ట్రంలో బలమైన పార్టీగా అవతరించిన చండ్ర పుల్లారెడ్డి గ్రూపు 1984లో రెండుగా చీలింది. నాటి నుంచి ఎదగటం ఆగిపోయి బలహీనపడుతూనే ఉంది. 84 లో విమోచనగా ఏర్పడి దానికి సిపి నాయకత్వం వహించారు. మరో పార్టీకి పైలా వాసుదేవరావు నాయకత్వంలో ప్రజా పంథా ఏర్పడి పనిచేశాయి. అన్నదమ్ములుగా ఒకే గొడుగు కింద పనిచేసిన నాయకత్వం రెండుగా విడిపోయి ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడటం కొందరు అమరులు కూడా అయ్యారు. ప్రజా పంద పార్టీ న్యూడెమోక్రసీ పార్టీగా అవతరించి తన కార్యక్రమాలను కొనసాగించింది. విమోచన గ్రూపుగా ఏర్పడి పనిచేసిన ఆ పార్టీ 1987లో రెండుగా చీలి ఒకటి విమోచనగా మరోటి ప్రతిఘటన పార్టీగా అవతరించింది. విమోచన జనశక్తిగా ఏర్పడిరది. జనశక్తికి కూర రాజన్న నాయకత్వం వహించగా, ప్రతిఘటనకు మధుసూదన్‌ రాజు నాయకత్వం వహించాడు. ప్రతిఘటన కంటే జనశక్తి పార్టీ బాగా విస్తరించింది. బలమైన నాయకత్వం కూడా ఉంది.

చివరికి జనశక్తి సీపీ లైన్‌ వదిలి ఎన్నికలను బహిష్కరించాలనే నినాదంతో ముందుకు వెళ్లి మావోయిస్టులతో కలిసి పనిచేసింది. అందులో భాగమే శాంతి చర్చల సమయంలో నాటి ప్రభుత్వం మావోయిస్టులను జనశక్తి నేతలను ఆ చర్చలకు ఆహ్వానించి మాట్లాడిన విషయం విధితమే. ఆ తర్వాత ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. నక్సల్స్‌ గ్రూపులపై ముకుమ్మడి దాడులు చేయడం వల్ల జనశక్తి బాగా బలహీన పడిపోయింది. న్యూ డెమోక్రసీ పార్టీ ఒకే పార్టీగా ఉన్న సమయంలో ఇల్లందు నియోజక ఎమ్మెల్యే స్థానాన్ని నిలబెట్టుకుంటూ వొచ్చింది. అయితే ఈ పార్టీలో కూడా ముసలం ఏర్పడడంతో 2013లో న్యూ డెమోక్రసీ రెండుగా చీలింది. ఒక గ్రూపునకు పెద్ద చంద్రన్న నాయకత్వం వహించగా.. మరో గ్రూపునకు పోటు సూర్య నాయకత్వం వహించాడు. ఈ రెండు పార్టీలు విడిపోవటం వల్ల ప్రజల్లో కూడా వీరి పట్ల సానుకూలత లేకుండా పోయింది. గ్రూపులుగా విడిపోవడం వల్ల అనేక మంది పార్టీని వీడి వ్యక్తిగత జీవితంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే పోటు సూర్యం నాయకత్వంలో ఉన్న న్యూ డెమోక్రసీ నుంచి పోటు రంగారావు నాయకత్వంలో ఆ పార్టీ నుంచి విడిపోయి మాస్‌ లైన్‌ గా ఏర్పడ్డారు. విడిపోవడమే తప్ప కలిసే గ్రూపులు తక్కువగానే ఉన్నాయి.

ఈ సమయంలోనే పెద్ద చంద్రన్న తో గుంటూరుకు సంబంధించిన బ్రహ్మ హత్య తర్వాత వీరిలో కూడా విభేదాలు వచ్చి పెద్ద చంద్రన్న అశోక్‌ ఒకవైపు సాదినేని వెంకటేశ్వరరావు, గోవర్ధన్‌, చిట్టి ప చిట్టి పాటి వెంకటేశ్వర్లు, సంధ్య మరోవైపుగా ఏర్పడ్డారు. ఇద్దరు కూడా న్యూ డెమోక్రసీ పేరుతోనే పనిచేస్తున్నారు. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఇంకా ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. విడిపోయిన ప్రతిసారి బుక్లెట్లు వేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే అటు సూర్యం నాయకత్వంలో ఉన్న న్యూ డెమోక్రసీ సాధినేని నాయకత్వంలో పనిచేస్తున్న న్యూ డెమోక్రసీ పార్టీలకు చెందిన నేతలు కలిసి పని చేయాలనే నిర్ణయానికి వొచ్చారు. విడిపోయి పనిచేయడం వల్ల రోజురోజుకు బలహీనపడటమే గాక ప్రజలు కూడా మనం ఇచ్చే పిలుపుకు స్పందించడం లేదని అభిప్రాయం రావడం వల్ల నేమో గానీ.. కలిసి పని చేయాలని ఆలోచనకు వొచ్చిన ఈ పార్టీల నేతలు గత ఏడాదిగా చర్చలు జరిపి చివరికి ఈనెల 28న రెండు పార్టీలు ఒకే గొడుగు కిందికి వొచ్చి పని చేయాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు.

అందుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని వేదికగా చేశారు. అయితే ఒక ప్రశ్న ఇప్పటికి ప్రజల నుంచి వొస్తున్నది. 1984 ఎందుకు విడిపోయారు? 1987లో ఎందుకు విడిపోయారు? 2013లో ఎందుకు చీలిపోయారు? ఏ సిద్ధాంత విభేదాలు వల్ల విడిపోయారని విషయాలను ప్రజలకు చెప్పటంలో ఈ పార్టీలు విఫలమయ్యారనే విషయం చెప్పుకోవాలి. 1984 నుండి విడిపోయిన ఈ పార్టీలు సిపి రెడ్డి ఆలోచన విధానాన్ని నేటికీ వ్యతిరేకించకపోగా సిపి రెడ్డి లైనే దేశానికి దిక్సూచి అని నమ్ముతున్న పార్టీలు అలాంటప్పుడు సిపి రెడ్డి ఆలోచనకు కట్టుబడ్డ ఈ పార్టీలు ఎందుకు విడిపోయాయనే దానికి సంబంధించి మాత్రం నేటికీ సరైన జవాబు లేదు. ఏది ఏమైనా ఈ రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు కలిసి ఒకే పార్టీగా పనిచేయటానికి పార్టీ క్యాడర్‌ అంతా ముందుకు రావడం సంతోషమే.. అయితే ఈ రెండు పార్టీల నేతలకు పదవులకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేకపోలేదు ఇలాంటి సమయంలోనే పదవులు రాకపోయినా పార్టీ కోసం పని చేయాలని దృఢ సంకల్పం ఉంటే మంచిది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com