- పరిశ్రమలకు భూకేటాయింపులపై ప్రత్యేక పాలసీ
- రూ.100 కోట్ల పెట్టుబడికి ‘డ్యూ’ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆసక్తి
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ శివార్లలో కొత్తగా రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన “డ్యూ’ సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రతినిధులతో మంగళవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘ఐటీ రంగంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. అందుకే హైటెక్ సిటీ తరహాలోనే కొత్తగా మరో రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వీటిని ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలి… నగర శివారుల్లో ఏయే ప్రాంతాల్లో ఇందుకు అనుకూలంగా ఉన్నాయో సంబంధిత యంత్రాంగం అధ్యయనం చేస్తుంది’ అని వివరించారు.
‘ఐటీ పార్కుల్లో పనిచేసే ఉద్యోగులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాం. రవాణా సౌకర్యాలు కల్పిస్తాం. ఎక్కడి నుంచైనా ఈ పార్కులకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తాం. ఈ పార్కుల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సాఫ్ట్ వేర్ కంపెనీలకు అవకాశం కల్పిస్తాం’ అని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ‘పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పరిశ్రమలకు భూకేటాయింపులపై ఇప్పటివరకు ప్రత్యేక పాలసీ అంటూ ఏదీ లేదు. దీనివల్ల పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రత్యేక పాలసీని రూపొందించాలని నిర్ణయించాం.
పెట్టుబడి, కల్పించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా భూమిని కేటాయిస్తాం’ అని అన్నారు. ‘హైదరాబాద్ లో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన డ్యూ సాఫ్ట్ వేర్ కంపెనీని సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకరిస్తాం. రాబోయే అయిదేళ్లలో ఈ సంస్థ 900 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది’ అని వివరించారు. కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ డా.విష్ణువర్ధన్ రెడ్డి, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్, “డ్యూ” వెంచర్స్ ప్రెసిడెంట్ సురేష్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు.