Monday, May 5, 2025

యుఎస్‌లో తెలుగు సినిమాలకు గడ్డుకాలం

– అమెరికా సినీ పరిశ్రమను రక్షించడమే లక్ష్యమని, ఇది జాతీయ భద్రతాంశమని ట్రంప్ వ్యాఖ్య
– ఈ నిర్ణయంతో అమెరికాలో తెలుగు చిత్రాల విడుదల వ్యయం రెట్టింపు అయ్యే అవకాశం
– చిన్న, మధ్య తరహా తెలుగు చిత్రాలు యూఎస్ లో విడుదలకు ఆటంకాలు ఏర్పడే సూచనలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ సంచలన నిర్ణయం, విదేశీ చిత్ర పరిశ్రమలతో పాటు ముఖ్యంగా అమెరికాలో మంచి మార్కెట్ కలిగిన తెలుగు సినిమాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. విదేశాల్లో నిర్మించి, అమెరికాకు దిగుమతి చేసే అన్ని రకాల చలనచిత్రాలపై తక్షణమే 100 శాతం సుంకం (టారిఫ్) విధించాలని ఆదేశించినట్లు ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు వాణిజ్య శాఖ, యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్‌కు సూచనలు జారీ చేసినట్లు తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో వెల్లడించారు.

అమెరికాలో సినిమా పరిశ్రమ వేగంగా దెబ్బతింటోందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు అందించి అమెరికన్ ఫిలిం మేకర్లను, స్టూడియోలను తమ దేశాలకు ఆకర్షిస్తున్నాయని ఆరోపించారు. “హాలీవుడ్‌తో పాటు అమెరికాలోని అనేక ప్రాంతాలు దీనివల్ల దెబ్బతింటున్నాయి. ఇది ఇతర దేశాలు చేస్తున్న సమష్టి ప్రయత్నం, అందువల్ల ఇది జాతీయ భద్రతకు ముప్పు” అని ట్రంప్ పేర్కొన్నారు. విదేశీ చిత్రాలు అమెరికా వ్యతిరేక ప్రచారానికి, తప్పుడు సంకేతాలను పంపడానికి కూడా ఉపయోగపడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. “మాకు అమెరికాలో తయారైన సినిమాలే కావాలి” అని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ ఆదేశాలపై అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ స్పందిస్తూ, తాము ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు ‘ఎక్స్’ లో తెలిపారు.

టాలీవుడ్‌ సినిమాలపై పడే ప్రభావం
ట్రంప్ సర్కార్ నిర్ణయం అమెరికాలో విడుదలయ్యే భారతీయ చిత్రాలపై, ముఖ్యంగా తెలుగు సినిమాలపై పెనుభారం మోపే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికాలో తెలుగు సినిమాలకు గణనీయమైన మార్కెట్ ఉంది. పలు చిత్రాలు మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరుతూ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. 2025లో కూడా కొన్ని తెలుగు చిత్రాలు యూఎస్‌లో భారీ విజయం సాధించాయి.

తాజాగా 100శాతం సుంకం నిర్ణయంతో, అమెరికాలో తెలుగు సినిమాలను విడుదల చేసే పంపిణీదారులకు దిగుమతి ఖర్చు ఒక్కసారిగా రెట్టింపు అవుతుంది. ఈ భారాన్ని వారు టికెట్ ధరల పెంపు రూపంలో ప్రేక్షకులపై మోపే అవకాశం ఉంది. దీనివల్ల టికెట్ ధరలు గణనీయంగా పెరిగి, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడంతో పాటు, బాక్సాఫీస్ వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పెరిగిన ఖర్చులు, తగ్గే లాభాల అంచనాలతో అమెరికాలోని తెలుగు చిత్రాల పంపిణీదారులు భవిష్యత్తులో సినిమాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. భారీ బడ్జెట్, అగ్ర తారల చిత్రాలకు మాత్రమే ఈ అదనపు భారాన్ని తట్టుకునే శక్తి ఉండొచ్చు. చిన్న, మధ్య తరహా బడ్జెట్ చిత్రాల అమెరికా విడుదల ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com