పాక్ హైకమిషన్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు
దేశం మొత్తం పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పట్ల తీవ్ర ఆవేదనతో ఉంటే.. పాక్ హైకమిషన్లో సంబరాలు చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. పాక్ హైకమిషన్ లోపలకు ఓ వ్యక్తి కేక్ తీసుకెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ చేతిలో ఉన్న బాక్స్ లో ఏముంది? కేక్ ఆర్డర్ చేశారా? అంటూ మీడియా ప్రతినిథులు ప్రశ్నలు సంధిస్తున్నారు కానీ ఆ వ్యక్తి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత ఢిల్లీలో ఉన్న పాక్ హై కమిషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారంటూ ఇంటిలిజెన్స్ నుంచి కేంద్రానికి సమాచారం వెళ్లిందని సమాచారం. కేక్ తెప్పించుకున్నట్టు ఆధారాలు సేకరించారట ఇంటిలిజెన్స్ అధికారులు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వాస్తవం ఎంతన్నది క్లారిటీ లేదు…
కశ్మీర్ పహల్గామ్‌లో పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిపై యావత్ ప్రపంచం అట్టుడికిపోతోంది. హిందువులా ముస్లింలా అని అడిగి మరీ ముష్కరమూక బుద్ధిచూపించారు. ఈ ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తీరు మార్చుకుని ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం నిలిపేవరకూ 1960 నాటి సింధు జల ఒప్పందం తక్షణమే నిలిపేస్తున్నట్టు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. వాఘా-అట్టారి సరిహద్దుని వెంటనే మూసివేస్తున్నట్టు ప్రకటించారు. పాకిస్తాన్ జాతీయులు మనదేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నామని ప్రకటించారు మిస్రీ. ఇప్పటికే భారత్ లో పాకిస్తానీయులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని గడువు విధించింది. న్యూఢిల్లీ పాకిస్తాన్ హైకమిషన్ లో ఉన్న వైమానిక, నేవీ, సైన్యం అధికారులు దేశం విడిచి వెళ్లేందుకు వారం సమయం ఇస్తున్నట్టు భారత విదేశాంగ కార్యదర్శి ప్రకటించారు. గతంలో పాకిస్తానీ జాతీయులకు జారీ చేసిన SVES వీసాలు రద్దుచేస్తున్నామన్నారు. ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్ సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించాలని భారత్ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ముందు భారత్ – పాక్ రాయబార కార్యాలయాల్లో 55 మంది ఉద్యోగులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 30 కి తగ్గింది. ఉగ్రదాడిలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులు అంతులేని ఆవేదనలో ఉన్నారు. పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ వద్ద నిరసనకు దిగారు. పాకిస్తాన్ నశించాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్‌ను నామరూపాలు లేకుండా చేయాలని నినాదాలు చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
భారత్ ప్రతీకార చర్యలకు ఉపక్రమించిన తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ జాతీయ భద్రతా కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు . IWTని నిలిపివేయడం, వాఘా-అట్టారి సరిహద్దును మూసివేయడం, పాకిస్తానీయులకు వీసాలను రద్దు చేయడం లాంటి భారత్ చర్యలను పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ తప్పుపట్టారు. భారత్ నిర్ణయాలు తీవ్రమైనవి, అనుచితమైనవి అన్నారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడితో పాకిస్తాన్ కు సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలను భారత్ సమర్పించలేదు…కేవలం ఆవేశంతోనే ఇలా స్పందించినట్టు అర్థమవుతోందన్నారు దార్. సంక్షోభం ఎదుర్కొన్న ప్రతిసారీ భారత్..పాక్ పై నిందలు వేస్తోందన్నారు. ఆరోపణలు కాదు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు ఇషాక్ దార్.