- కనీసం హాస్పిటల్‌కు వెళ్దామన్న డబ్బుల్లేని పరిస్థితి
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారని, దీనిలో భాగంగానే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులూ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. ఈ పోలీస్ అధికారి ఆవేదన చూస్తే హృదయం కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 30 ఏళ్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన ఠాగూర్ నారాయణ సింగ్ ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం చాలా బాధాకరమని హరీష్‌రావు వాపోయారు. ఒకవైపు ఆ అధికారి రెండు కిడ్నీలు చెడిపోయి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మరోవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి ఆందోళన చెందుతున్నారని అన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య భద్రత కార్డుతో చికిత్స చేయించుకుందామని హాస్పిటల్‌కి వెళ్తే ఆ కార్డు చెల్లదని పంపిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ విశ్రాంత పోలీసు ఉద్యోగికి శాపంగా మారిందని హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఒక నారాయణ సింగ్ సమస్య కాదని.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ అయిన 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవన్మరణ సమస్య అని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఉద్యోగుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్న వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. వైద్యసేవలు పొందడంలో అంతరాయం కలగకుండా ఈహెచ్‌ఎస్, పోలీస్ ఆరోగ్య భద్రత కార్డులు హాస్పిటల్‌ల్లో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.