Friday, November 15, 2024

Unified lending interface: త్వరలో అందుబాటులోకి యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్‌

ఇక రుణాలు పొందడం సులువు..!

ఈ రోజుల్లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో ఇదొక సంచలనం. పేటీఎం (Paytm), ఫోన్ పే (Phone pay) లాంటి యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్‌లు జరిపే ప్రతి ఒక్కరికీ ఇది తెలుసు. గ్రామీణ స్థాయిలోనూ డిజిటల్ చెల్లింపులకు యూపీఐ శ్రీకారం చుట్టింది. అదే తరహాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పుడు కొత్తగా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్‌ (ULI) ను అందుబాటులోకి తీసుకురానుంది.

సులభంగా రుణాలను పొందడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ యూఎల్ఐని తెరపైకి తెస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ కూడా మరో సంచలనానికి తెర తీస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. దేశంలో రుణాల మంజూరు వ్యవస్థను మరింత వేగవంతం చేయడం దీని ఉద్దేశం. ఇది లెండింగ్ సెగ్మెంట్‌ను, ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చివేయగలదని భావిస్తున్నారు. రుణాలు పొందడంలో ఇబ్బందులను తొలగించేలా యూఎల్ఐని రూపొందించినట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

కర్ణాటక రాజధాని బెంగళూరులో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో దాస్ మాట్లాడారు. పైలట్‌ ప్రాజెక్ట్‌గా యూఎల్ఐని ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో ఎదురయ్యే సాంకేతికపరమైన ఇబ్బందులను గుర్తించి పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా యూఎల్ఐని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను రూపురేఖలను యూపీఐ మార్చినట్లే దేశంలో రుణాలు ఇచ్చే విధానాన్ని కూడా యూఎల్ఐ మార్చివేస్తుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

గ్రామీణ రుణ గ్రహీతలకు ఇది మరింత ఉపయోగపడుతుందని, వారి అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించామని దాస్‌ తెలిపారు. జన్‌ధన్ యోజన, ఆధార్‌, యూపీఐ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వేగంగా పరుగులు పెట్టించేలా, రుణాల జారీని మరింత వేగవంతం చేసేలా యూఎల్ఐ కూడా ఓ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని శక్తికాంత దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. జామ్-యూపీఐ-యూఎల్ఐలను ఆయన త్రిమూర్తులుగా అభివర్ణించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular