కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ హిత బడ్జెట్ అని ఇది మోదీ విజనరీకి అద్దం పట్టేలా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మౌలిక రంగాలకు అత్యధిక నిధులు కేటాయింపు భేష్ అన్నారు. వ్యవసాయం, విద్యకు పెద్దపీట వేశామన్నారు. 3 కోట్ల మందికి ఇండ్లు నిర్మించేలా బడ్జెట్ ప్రతిపాదనలు బాగున్నాయన్నారు. నాగలికి రెండు ఎడ్ల మాదిరిగా సమపాళ్లలో అభివృద్ధి, సంక్షేమం ప్రతిబింబించే బడ్జెట్ అన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ప్రాధాన్యతనిచ్చామన్నారు.
తెలంగాణకు నిధులివ్వలేదనడం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ల మూర్ఖత్వానికి నిదర్శనం అని విమర్శించారు. తెలంగాణసహా దేశంలోని వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధుల కేటాయింపు చేసిందన్నారు. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్ లో 210 కి.మీల తెలంగాణలో భాగమేననే విషయం తెల్వదా అని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని నిపుణులు తేల్చిన సంగతి మర్చిపోయారా అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అంశాన్ని పొందుపర్చని ది మీరు కాదా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం పైసలు పంచుడు…దంచుడు…అప్పుల్లో ముంచుడు తప్ప కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సాధించిందేమిటి అని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ది చెప్పినా మీ వంకర బుద్ది మారలేదా అన్నారు. ఇకనైనా తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర సహాయ సహకారాలపై నిర్మాణాత్మక సలహాలివ్వాలని సూచించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చురకలు అంటించారు.