సీఎం రేవంత్ ఏరికోరి రంగనాధ్ ను ఎందుకు తెచ్చుకున్నారంటే?
హైడ్రా.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఈ పేరే వినిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. మరీ ముఖ్యంగా చెరువులను ఆక్రమంచి కట్టిన కట్టడాలనవు నెల మట్టం చేస్తోంది. సామాన్యుల నుంచి బడాబాబుల వరకు ఎవకు ఆక్రమణలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటోంది హైడ్రా. దీంతో చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారి గుండెల్లో దడ పుడుతోంది. మొన్న జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్‌కు సంబంధించిన 2 వేల గజాల పార్కు స్థలంలో గురుబ్రహ్మ నగర్ వాసులు గుడిసెలు వేయగా వాటిని హైడ్రా తొలగించి ప్రహరీ గోడ నిర్మించింది. దీంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు మరికొందరు ప్రహరీని కూల్చడంతో హైడ్రా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే దానం నాగేందర్‌తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.
అంతకు ముందు రంగారెడ్డి జిల్లాలోని గండిపేట్ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం నేమట్టం చేసింది. ఒక్కరోజే ఏకంగా 50కి పైగా భవనాలను కూల్చేసింది. అంతే కాకుండా చిత్రపురి కాలనీలో అక్రమంగా కట్టిన 7 లగ్జరీ విల్లాలను కూల్చేసింది. తాజాగా మాదాపూర్ లో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబందించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయడంతో మరోసారి హైడ్రా హైలెట్ అయ్యింది. ఇలా ఆక్రమణలకు పాల్పడిన వారి వెన్నులో వణుకు పుట్టిస్తున్న హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ ఎప్పటికప్పుడు హెడ్ లైన్స్‌లో నిలిచారు. దీంతో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు హైడ్రా కమీషనర్ రంగనాధ్ ఎవరని, ఆయన బ్యాక్ గ్రౌండ్ ఎంటని గూగుల్ సెర్చ్ చేస్తున్నారు.
ఏవీ రంగనాధ్ 1970 అక్టోబర్ 22వ తేదీన నల్లగొండ జిల్లాలో సుబ్బయ్య, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. హుజూర్ నగర్ తదితర ప్రాంతాల్లో స్కూలు విద్యను అభ్యసించిన ఆయన పదవ తరగతి మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో చదువుకున్నారు. హైదరాబాద్‌లో ఇంటర్ చదువుకోవడంతో పాటు ఇంజనీరింగ్ పూర్తి చేశారు రంగనాధ్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేసిన తరువాత బెంగళూరులో ఐడీబీఐ బ్యాంకులో కొంతకాలం పనిచేశారు. అలా బ్యాంకు ఉద్యోగం చేస్తూనే గ్రూప్-1 పరీక్షలు రాసి రాష్ట్రస్థాయిలో 13వ ర్యాంక్ సాధించారు రంగనాధ్. పోలీస్ కావాలన్న బలమైన కోరికతో డీఎస్పీ ఆప్షన్ తీసుకున్న రంగనాథ్.. 1996 బ్యాచ్ లో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా నియమితులయ్యారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం డీఎస్పీగా పనిచేసిన రంగనాథ్.. 2003 వరకు అక్కడే పనిచేసి వరంగల్ జిల్లా నర్సంపేటకు ట్రాన్స్ఫర్ అయ్యారు. 2004 ఎన్నికల సమయంలో నక్సల్స్ కు అడ్డాగా ఉన్న ప్రకాశం జిల్లా మార్కాపురంలో పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రభుత్వం, నక్సల్స్ మధ్య జరిగిన చర్చల సందర్భంలో నక్సల్స్ కేంద్ర నాయకుడు రామకృష్ణకు స్థానిక పోలీసు అధికారిగా స్వాగతం పలికారు రంగనాధ్. బలిమెల రిజర్వాయర్ వద్ద నక్సల్స్ చేతిలో గ్రేహౌండ్స్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన సమయంలో రంగనాథ్ ను తూర్పు గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీగా పంపించింది ప్రభుత్వం.
ఆ తరువాత 2014 వరకు ఖమ్మం జిల్లా ఎస్పీగా పనిచేసిన రంగనాధ్.. అక్కడి నుంచి నల్గొండ జిల్లాకు బదిలీ అయ్యారు. అక్కడ సుమారు నాలుగేళ్లు పనిచేసి తనదైన మార్కు చూపించారు. ఇక అప్పట్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసు, నల్గొండ జిల్లాలో అమృత ప్రణయ్ కేసులలో ఏవీ రంగనాథ్ తనదైన స్టైల్లో పనిచేశారు. అంతే కాదు అప్పటి కృష్ణా జిల్లా నందిగామలో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసును ఛేదించడంలో ఏవీ రంగనాథ్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. పవర్‌ఫుల్ పోలీస్‌గా పేరు తెచ్చుకున్న ఏవీ రంగనాథ్ పనితీరుకు గుర్తింపుగా రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది.
నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సమయంలోనే రంగనాథ్‌కు డీఐజీగా ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ పనిచేశారు. నగరవాసులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ట్రాఫిక్ అని గుర్తించిన రంగనాథ్.. ఎన్నో పరిష్కార మార్గాలు చూపించారు. ఇక ఆపరేషన్ రోప్ లో ఏవీ రంగనాథ్ కీలక పాత్ర పోషించారు. ఫుట్ పాత్‌లు ఆక్రమిస్తున్న వ్యాపారులపై కేసులు, తప్పుడు నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వారిపై చర్యలు.. ఇలా హైదరాబాద్ నగరంలో తనదైన ముద్ర వేశారు రంగనాధ్. చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ లోక్ అదాలత్ ను ఆన్‌లైన్ లో నిర్వహించేలా చేశారు. ట్రాఫిక్ విభాగంలోనూ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహణ, జంక్షన్లలో డైరీలు ఏర్పాటు, అడ్డదిడ్డంగా ప్రయాణిస్తోన్న అంబులెన్స్‌ల క్రమబద్దీకరణ, జంక్షన్లలో గ్రీన్ లైట్ వినియోగం పెంపు, కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగింపు, అతిగా శబ్దం చేసే హారన్ల వినియోగంపై ఆంక్షలు.. ఇలా హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు రంగనాథ్.
హైదరాబాద్ నుంచి వరంగల్ కమీషనర్ గా బదిలీ అయిన రంగనాథ్ అక్కడా తనదైన పనితీరు చూపించి శభాష్ అనిపించుకున్నారు. హైదరాబాద్ తరహాలోనే వరంగల్ నగరంలోనూ ట్రాఫిక్‌పై దృష్టి పెట్టిన రంగనాధ్.. ఎన్నో స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. వరంగల్ లో భూకబ్జాలు, అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టి అక్రమార్కులకు చుక్కలు చూపించారు. కబ్జాలకు గురైన ఎన్నో భూములను విడిపించి అసలైన హక్కుదారులకు అప్పగించారు. రంగనాధ్ చేసిన సేవలకు మెచ్చి ఎంతో మంది బాధితులు ఆయన ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఇదిగో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో భూకబ్జాలు, అక్రమ కట్టడాలు నిరోధించడానికి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ-హైడ్రా పేరుతో ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి ఏవీ రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హైడ్రా కమీషనర్ గా రంగనాధ్ శరవేగంగా రంగంలోకి దిగి కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. రాజకీయ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నా.. వాటిని ఏ మాత్రం లెక్కచేయకుండా ఏవీ రంగనాథ్, తన పని తాను చేసుకుంటూ పోతూ అక్రమార్కుల భరతం పడుతున్నారు. ఇప్పటికే సుమారు 20కి పైగా చెరువుల్లో ఆక్రమణలు తొలగించి 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంది హైడ్రా. దీంతో హైడ్రా పనితీరు, ఏవీ రంగనాధ్ డైనమిజాన్ని సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రశంసిస్తున్నారు. అంతే కాదు హైడ్రా లాంటి వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో పాటు అటు ఆంధ్రప్రదేశ్ లో, మరోవైపు దేశరాజధాని ఢిల్లీలోను హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వస్తోందంటే రంగనాధ్ ఎలా పనిచేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.