అమెరికా సైన్యం సిరియాలో వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, ఆల్‌ఖైదా అనుబంధ సంస్థ హుర్రాస్ అల్-దీన్‌కు చెందిన మొత్తం 37 మంది ఉగ్రవాదులు హతమైనట్టు అమెరికా ప్రకటించింది. తాము మట్టుబెట్టినవారిలో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు చెప్పింది అమెరికా. వాయువ్య, సెంట్రల్ సిరియాలో రెండు వేర్వేరు ఆపరేషన్లు చేపట్టినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయేల్ వరుస దాడులతో పశ్చిమాసియా రగిలిపోతోంది. రోజు రోజుకు పెరుగుతోన్న ఉద్రిక్తతలతో ప్రాంతీయ యుద్ధ విస్తరణ భయాలు కమ్ముకుంటున్నాయి.
ఈ దాడులతో ఐసిస్ శక్తిసామర్థ్యాలు దెబ్బతిన్నట్లు అగ్ర రాజ్యం అమెరికా ప్రకటించింది. తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించే, మిత్రదేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించేవారి విషయంలో ఉపేక్షించబోమని హెచ్చరించింది. గతంలో పెద్దఎత్తున సిరియా భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకున్న ఐసిస్ గ్రూప్.. మళ్లీ విస్తరించకుండా అడ్డుకునేందుకు అక్కడ అమెరికా ప్రస్తుతం సుమారు 900 మంది భద్రత సిబ్బందిని మోహరించింది. స్థానిక భాగస్వాములు కుర్దిష్ నాయకత్వంలోని సిరియన్ డెమొక్రాటిక్ ఫోర్స్‌తో కలిసి అమెరికా పనిచేస్తోంది. ఇరాన్ మద్దతున్న ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు సాగిస్తోన్న వ్యూహాత్మకంగా కీలకమైన వాయువ్య సిరియాపై అమెరికా దృష్టిసారించింది.
మంగళవారం అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ హుర్రాస్ అల్-దీన్ కు చెందిన ఓ కీలక నేతతో పాటు మరో ఎనిమిది మందిని లక్ష్యంగా చేసుకుని వాయువ్య సిరియాపై దాడి చేసినట్లు పేర్కొంది. ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలకు విఘాతం కలిగించేలా దాడులకు ఈ గ్రూప్ కుట్ర పన్నడం, సమన్వయం చేసుకోవడం కొనసాగిస్తోందని తెలిపారు. ఆ సీనియర్ కమాండర్ స్థానికంగా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపింది. అంతకు ముందు మధ్య సిరియాలోని ఐసిస్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై పెద్దఎత్తున వైమానిక దాడలు నిర్వహించి 28 మంది ఉగ్రవాదులను అంతమొందించారు.