నియంత పాలనను గుర్తు చేసే దేశం ఏదైనా ఉందంటే అది ఉత్తర కొరియా. ప్రస్తుతం ఆ దేశాన్ని పాలిస్తున్న కిమ్ జోంగ్ ఉన్ ప్రజలపై నిర్భందం ఏ స్థాయిలో అమలుచేస్తారో చెప్పే ఘటన తాజాగా చోటుచేసుకుంది. కిమ్ రాజ్యం నుంచి అధికారుల కళ్లుగప్పి పారిపోయి వచ్చిన టిమోతి ఛో అనే పౌరుడు మీడియాతో మాట్లాడారు. ఉత్తర కొరియాలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వెల్లడించారు. ఈ రోజుల్లో పూరిగుడిసెలో కూడా టీవీ, దానికి కేబుల్ కనెక్షన్ కనిపించడం చూస్తూనే ఉంటాం.. కానీ ఉత్తర కొరియాలో మాత్రం ప్రజలు ఎవరైనా టీవీ కొనాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి పొందాలట.
టీవీ కొంటే ప్రభుత్వం తరఫున ఓ అధికారి పోలీసులతో కలిసి ఇంటికి వచ్చి రహస్యంగా యాంటెన్నాలు దాచారేమోనని సోదాలు జరుపుతారట. ఒక్క యాంటెన్నా మాత్రం ఉంచి మిగతా వాటిని పట్టుకెళ్లిపోతారని టిమోతి ఛో చెప్పారు. ఆ యాంటెన్నాతో ప్రభుత్వ ప్రసారాలు తప్ప ఇతర ప్రోగ్రాంలు ఏవీ రావని వివరించారు. ప్రభుత్వ ప్రోగ్రాంలు అంటే 24 గంటలూ కిమ్ కుటుంబం గురించి, కిమ్ తండ్రి, తాతల గొప్పదనం గురించిన కార్యక్రమాలే ప్రసారం అవుతాయని చెప్పారు. చివరకు జుట్టు కత్తిరించుకోవడానికీ ప్రభుత్వం రూల్స్ పెట్టిందని, స్కూలు పిల్లలు ఒకటి రెండు స్టైల్స్ తప్ప వేరేలా కత్తిరించుకోవడం నిషేధమని వివరించారు.
రూల్స్ కు విరుద్ధంగా జుట్టు ఒకటి రెండు సెంటీమీటర్లు ఎక్కువ పొడవు ఉందంటే చిక్కుల్లో పడతారని తెలిపారు. సదరు విద్యార్థి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారి నుంచి స్టేట్ మెంట్ తీసుకుంటారని టిమోతి ఛో వివరించారు. ఉత్తర కొరియాలో జాతీయ సెలవు దినం రోజు ప్రతీ పౌరుడు కిమ్ కుటుంబ విగ్రహాలను సందర్శించి, అక్కడ మోకరిల్లాలని చెప్పారు. కిమ్ కఠినమైన పాలనలో బతకలేక తాను తప్పించుకుని పారిపోయి వచ్చానని, గతంలో ఒకసారి ఈ ప్రయత్నంలో అధికారులకు పట్టుబడ్డానని టిమోతి ఛో తెలిపారు.