ఎమ్మెల్యేను అడ్డుకున్న ఎస్పీఎఫ్ పోలీసులు
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి సచివాలయంలో చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఆరో అంతస్తుకు సిఎస్ శాంతికుమారి వస్తున్న సమయంలోనే వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అదే అంతస్థులో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎస్పీఎఫ్ పోలీసులు ఎమ్మెల్యే మేఘారెడ్డిని అడ్డుకున్నారు. సిఎస్ వస్తున్నారు పక్కన ఉండాలంటూ నిలబెట్టారు. దీంతో తాను ఎమ్మెల్యేనని చెప్పినా వారు వినిపించుకోలేదు.
ఈ క్రమంలో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే మేఘారెడ్డి, సిఎస్ వస్తే ఆరో ఫ్లోర్‌లో ఎవరూ ఉండకూడదా అని ప్రశ్నించారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, ఇలాంటి ఘటనలు సచివాలయంలో నిత్యం చోటుచేసుకుంటున్నాయని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. కనీసం ఎవరు ఎంపి, ఎవరు ఎమ్మెల్యేనో ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తుపట్టడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.