వాన్‌గార్డ్ సీఈఓ సలీం రాంజీ, ఐటీ డివిజన్ సీఐఓ, ఎండీ నితిన్ టాండన్, చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ జాన్ కౌచర్, జిసిసి-వాన్‌గార్డ్ ఇండియా హెడ్ వెంకటేష్ నటరాజన్ నేతృత్వంలో కంపెనీ ప్రతినిధి బృందం ఈ చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఉన్నారు.
ఈ సందర్భంగా జరిగిన చర్చల అనంతరం హైదరాబాద్ లో జీసీసీ ఏర్పాటు నిర్ణయాన్ని ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్‌లో తమ జీసీసీ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపింది. రాబోయే నాలుగు సంవత్సరాల్లో 2,300 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించింది. వాన్‌గార్డ్ ప్రపంచంలో పేరొందిన పెట్టుబడి సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను ఈ కంపెనీ నిర్వహిస్తుంది ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్లకు పైగా పెట్టుబడిదారులకు తమ సేవలు అందిస్తుంది.

హైదరాబాద్ లో వాన్ గార్డ్ ఏర్పాటు చేసే కేంద్రం ఇన్నోవేషన్ హబ్‌గా పనిచేయనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, మొబైల్ ఇంజనీరింగ్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అందుకు అవసరమైన ఇంజనీర్లను తక్షణమే నియమించుకోవాలని ప్లాన్ చేస్తోంది.
హైదరాబాద్ లో వాన్ గార్డ్ జీసీసీ ఏర్పాటుకు ముందుకు రావటం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి జీసీసీ గమ్య స్థానంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. వాన్‌గార్డ్ రాకతో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ మరింత బలపడుతుందని అన్నారు. మన దేశంలోని ప్రతిభను ఉపయోగించుకోవడానికి, సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తుందని అన్నారు. ప్రభుత్వం తరఫున తగినంత సహకారం అందిస్తుందని కంపెనీ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.