Sunday, May 4, 2025

వాణిజ్య బంధానికి బ్రేక్‌..!

భారత్‌, పాక్‌ మధ్య నిలిచిన దిగుమతులు

పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్, భారత దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ ను ఇరుకునపెట్టేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలపైనా భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతోపాటు తదితర కఠిన నిర్ణయాలు తీసుకున్న భారత ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ దేశం నుంచి దిగుమతులన్నింటినీ నిషేదించింది. జాతీయ భద్రత, ప్రజా విధానాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిసింది. పాకిస్థాన్ నుంచి రవాణా చేయబడే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేదం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని, ఈ నిషేధం ఆజ్ఞల నుంచి మినహాయింపు పొందాలంటే కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరం అని వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఇదిలాఉంటే.. పహల్గాం ఉగ్రదాడి తరువాత భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఏకైక వాణిజ్య మార్గమైన వాఘా -అట్టారి సరిహద్దు ఇప్పటికే మూసివేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ నుంచి ప్రధానంగా ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనెగింజలు భారతదేశానికి దిగుమతి అవుతాయి. 2019 పుల్వామా దాడి తరువాత భారతదేశం పాకిస్థాన్ ఉత్పత్తులపై 200శాతం సుంకం విధించడంతో దిగుమతులు తగ్గిపోయాయి. కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనెగింజల వంటి వాటిని మాత్రమే దాయాది నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అయితే, ఈ దిగుమతుల విలువ చాలా తక్కువ. ప్రపంచ వ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం 0.06 శాతం మాత్రమే.

పాకిస్తాన్ భారతదేశానికి ఎగుమతి చేసే కీలక ఉత్పత్తులు..
♦ పాకిస్థాన్ నుంచి భారతదేశానికి ఎగుమతుల్లో సిమెంట్ అగ్రస్థానంలో ఉంది. పంజాబ్, రాజస్థాన్ వంటి ఉత్తర భారత రాష్ట్రాల్లో ఈ సిమెంట్ ను ఎక్కువగా వినియోగిస్తుంటారు.
♦ భారతదేశం వస్త్ర కేంద్రంగా ఉన్నప్పటికీ పాకిస్థాన్ నుంచి కొంత మొత్తంలో వస్త్ర ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటుంది. వీటిలో ముఖ్యంగా ముడి పత్తి, పత్తి నూలు, పట్టు వ్యర్థాలు ఉన్నాయి.
♦ పాకిస్థాన్ నుంచి వివిధ రకాల పండ్లు, ఆహార పదార్థాలు దిగుమతి అవుతుంటాయి. వాటిలో ఖర్జూరాలు, మామిడి పండ్లు ఉన్నాయి. భారత్ లో కొరత ఉన్న సందర్భాల్లో ఉల్లిపాయలు, టమోటాలు కూడా పాకిస్థాన్ నుంచి దిగుమతి అవుతుంటాయి.
♦ రాతి ఉప్పు, జిప్సం, టాన్డ్ తోలు, ఔషదాలలో ఉపయోగించే కాల్షియం కార్బోనేట్, పలు రసాయన ఉత్పత్తులను పాకిస్థాన్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకుంటుంది.
♦ క్రికెట్ బ్యాట్లు, బంతులు, చేతి తొడుగులతోపాటు.. శస్త్రచికిత్సా పరికరాలు, కళ్లద్దాల లెన్సులు కూడా దిగుమతి అవుతుంటాయి.

ఎగుమతి చేసేవి ఏంటి..?
భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు ఎగుమతి చేసేవాటిలో ముడిపత్తి, సేంద్రీయ రసాయనాలు, తయారుచేసిన పశుగ్రాసం, ఫ్లాస్టిక్‌ వస్తువులు, మానవ నిర్మిత ఫిలమెంట్‌, కొన్ని రకాల కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు, రంగులు, నూనె గింజలు, పాల ఉత్పత్తులు, కొన్ని రకాల ఔషధాలు.

అంతే.. అనుమతించం
కాగా, “పాకిస్థాన్ మూలం ఉన్న లేదా అక్కడి నుంచి ఎగుమతి అయిన ఏ వస్తువైనా సరే భారతదేశంలోకి అనుమతించబోం.. అన్ని వస్తువుల దిగుమతి లేదా రవాణాపై నిషేధం అమలు చేస్తున్నాం. జాతీయ భద్రత, ప్రజా విధానం దృష్ట్యా ఈ ఆంక్షలు విధించబడ్డాయి” అని వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో వివరించింది. అత్యవసర పరిస్థితుల్లో ఏవైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.

మరింత దిగజారనున్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ
ఇప్పటికే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలహీనంగా ఉంది. ఇప్పుడు భారత్ ప్రకటించిన వాణిజ్య యుద్ధంతో.. దాయాది దేశం మరింత ఎఫెక్ట్ కానుంది. తాజా నిషేధంతో.. ఔషధాలు, రసాయనాలు, పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ లాంటి వస్తువుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. గతేడాది పాకిస్థాన్ నుంచి భారత్‌కు.. సుమారు 305 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు దిగుమతి అయ్యాయి. ఆ లెక్కన చూస్తే.. పాకిస్థాన్‌ ఇప్పుడు భారీగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక.. భారత వస్తువులు.. దుబాయ్, సింగపూర్, శ్రీలంక లాంటి దేశాల ద్వారా పాకిస్థాన్‌కు చేరుతున్నాయి. వీటి విలువ సుమారు 10 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నిషేధంతో.. ఈ వాణిజ్యాన్ని కూడా ఆపేస్తుంది. ఈ చర్యల వల్ల పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆహార కొరతతో పాటు ఔషధాల కొరత తీవ్రమవుతుందని అంచనా వేస్తున్నారు.
నిజానికి, భారత్ – పాకిస్థాన్ మధ్య వాణిజ్య సంబంధాలు 2019 నుంచే దాదాపుగా స్తంభించాయ్. పుల్వామా దాడి తర్వాత.. రెండు దేశాల మధ్య అంతంతమాత్రంగానే వాణిజ్యం కొనసాగుతోంది. అయినప్పటికీ.. దుబాయ్, సింగపూర్ లాంటి దేశాల ద్వారా అనధికార వాణిజ్యం జరుగుతోంది. ఇప్పుడు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగే ఎగుమతులు, దిగుమతులన్నీ నిలిచిపోయాయ్. పహల్గామ్ ఉగ్రదాడి.. రెండు దేశాల మధ్య ఆర్థిక, దౌత్య, వాణిజ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. భారత్.. పాక్ వస్తువుల దిగుమతిపై నిషేధం విధించడం, సరిహద్దులు మూసేయడం, సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం లాంటి చర్యలు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపుతాయి.

భారత తీర జలాల్లో పాక్‌ బోట్లపై నిషేధం
అలాగే..భారత తీర జలాల్లో పాకిస్థాన్‌ బోట్లపై కూడా నిషేధం విధించింది. అసలు పాక్‌కు చెందిన ఏ బోట్‌ కూడా భారత పోర్టుల్లోకి ప్రవేశించకుండా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే భారత గగనతలంలోకి పాకిస్థాన్ సివిల్, మిలటరీ విమానాలు ఎంటర్‌ కాకుండా నిషేధం విధించింది కేంద్రం. దీంతో పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ చైనా, శ్రీలంక మీదుగా తిరిగి వెళుతున్నాయి. అంతకంటే ముందే భారత గడ్డపై పాక్‌ దేశస్థులపే నిషేధం పడింది. దౌత్యాధికారుల సంఖ్యను సగానికి సగం తగ్గించేసింది. అదే సమయంలో భారత్‌లో పాకిస్థాన్ పౌరులు ఉండకూడదని ఆదేశాలు వెలువడ్డాయి.

పాక్ పోర్టుల్లోకి కూడా భారత్ నౌకలు వెళ్లొద్దన్న కేంద్రం
ఇప్పటికే వందలాది మంది భారత్‌ను విడిచి పెట్టి వెళ్లారు. ఇలా ఏ విధంగా కూడా పాకిస్థాన్‌ అనే పేరు భారత్‌లో వినపడకుండా చర్యలు తీసుకుంటోంది భారత్. మరోవైపు పాక్ పరోక్ష దిగుమతులపైనా నిషేధం విధించింది. ఏ విధంగానూ పాక్‌కు చెందిన దిగుమతులు భారత్‌లోకి రావడానికి వీల్లేదని ప్రకటించింది. నేరుగా కానీ.. ఇతర దేశాల మీదుగా కానీ పాక్‌కు చెందిన వస్తువులు భారత్‌లోకి రాకూడదని ఆదేశాలు వెలువడ్డాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇవి అమల్లో ఉండనున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com