నైరుతి రుతుపవనాలు సమయానికి కంటే ముందుగా రావడం వల్ల పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. శనివారం దిల్లీలో బీభత్సం సృష్టించగా, ఆదివారం అర్ధరాత్రి మహారాష్ట్రలో భారీగా వర్షపాతం నమోదైంది. మరోవైపు కేరళ, కర్ణాటకలో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఇదిలా ఉండగా మే31 వరకు పలు రాష్ట్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు సమయం కంటే ముందుగా కేరళ తర్వాత మహారాష్ట్రకు చేరుకున్నాయి. 35సంవత్సరాల తర్వాత రుతుపవనాలు ముందుగా రావడం ఇదే మొదటిసారి. దీంతో ముంబయి, పుణేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి కురిసిన బారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు చేప్టటింది. అయితే రానున్న కొద్ది గంటల్లో ముంబయిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. రాయ్గడ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ముంబయి, థానే, పాల్గర్, మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అమల్లో ఉంది.
స్కూల్స్, కాలేజీలకు సెలవు
మరోవైపు కర్ణాటకలో కూడా ఆదివారం మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో కర్ణాటకలోని తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు వర్షాలు కారణంగా మైసూరు కొడుగు జిల్లాలో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మే 31 వరకు కర్ణాటకలోని పలు జిల్లాలో 50-60 కి.మీ. వేగంతో గాలులు వీస్తూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అటు కేరళలోనూ 11 జిల్లాలకు రెడ్ అల్టర్, మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో కేరళ ప్రభుత్వం త్రిస్సూర్, ఇడుక్కి, ఎర్నాకుళం, వయనాడ్, కాసర్గోడ్ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిది. కేరళ, తమిళనాడు, మహేలో మే 29వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఛత్తీస్గఢ్, అండమాన్, నికోబార్ దీవుల్లో మే 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఒడిశా, ఝార్ఖండ్, బంగాల్, సిక్కిం, బిహార్ రాష్ట్రాల్లో మే 31వరకు గంటకు 40-50కిలోమీటర్ల ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు
రానున్న ఏడు రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో గంటకు 30-40కిలోమీటర్ల గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మే 28,29 తేదీల్లో నాగాలాండ్, మణిపుర్, మిజోరాం, త్రిపురలో, మే30,31 తేదీల్లో అసోం, మేఘాలయలో అతీ భారీ వర్షాలు కురుసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.