కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న వీపనగండ్ల గంగమ్మ దేవత(పాము కాటు) జాతర ఉత్సవాలు మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగునున్నాయి. ప్రతి సంవత్సరం దీపావళి ఆశ్వయుజ అమావాస్య సందర్భంగా పాము కాటు జాతర పేరుతో గంగాదేవి ఉత్సవాలను జరపటం ఆనవాయితీగా వస్తుంది. అమావాస్య రోజు యాదవ కులానికి చెందిన గంగయ్య గంగమ్మ దేవి ఆలయంలో గంగాదేవి ఎదుట గౌరీదేవి నోములు నోచుకుని అదే రోజు రాత్రి ఆలయంలో ఇసుకపై నిద్రించటం జరుగుతుంది. నిద్రించిన వ్యక్తి పక్కన మట్టి(ఆటిక) చిప్పలో పాలను పోసి మంచి ఆలయ తలుపులను ముసి వేసేవారు. ఆ తరువాత రోజు నాగుపాము గుడిలోకి వచ్చి నిద్రిస్తున్న ఆ వ్యక్తిని పాముకాటు వేసి చిప్పలో ఉంచిన పాలను తాగి వెళ్లటం ఆనవాయితీగా జరిగేది. మరుసటి రోజు భక్తులు ఆలయ తలుపులు తెరిచి చూడగా ఇసుకపై పడుకున్న పూజారి ఆకు పచ్చ వర్ణంలోకి మారటం, ఆ తరువాత బైండ్ల వాళ్ళు అమ్మవారి కథను చెప్పుకుంటూ నిద్రలో ఉన్న భక్తుడిని లేపి బాజా భజంత్రీలతో ఎద్దుల బండ్లపై ఊరేగింపుగా గ్రామంలోని గంగమ్మ బాయి వద్దకు తీసుకువచ్చేవారు. అనంతరం భక్తులు గంగాదేవిని దర్శించి భక్తితో మొక్కలను తీర్చుకునేవారు.కాలక్రమేన భక్తుడు గంగయ్య వృద్ధాప్యంతో శివైక్యం చెందారు. తదనంతరం గంగయ్య మనుమడు గణేష్ యాదవ్ భక్తిశ్రద్ధలతో గంగమ్మ ఆలయంలో నోములు నోచుకుంటూ ఆనవాయితిని కొనసాగిస్తున్నారు. గ్రామంలో మూడు రోజుల పాటు జరిగే పాము కాటు జాతరకు మండలంలోని గ్రామాల ప్రజలే కాక చుట్టుప్రక్కల మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గంగాదేవిని దర్శించుకుంటారు. గ్రామపంచాయతీ, గ్రామ రైతు కమిటీ నిర్వాహకులు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేశారు.