బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని నివాసంలో ఆయన్ను కలిశారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కమిషన్ నోటీసులు, ఇతర అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. దీంతో పాటుగా కవిత విషయం కూడా చర్చించినట్లు తెలుస్తున్నది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు వెళ్లాలా వద్దా అనే దానిపై చర్చ జరిగింది. కమిషన్ ఇచ్చిన తేదీకి వెళ్లడమా.. మరో తేదీ అడుగడమా అనే విషయంపై ఆరగంటకు పైగా సమావేశం కొనసాగింది. రెండు రోజుల వ్యవధిలనే రెండు సార్లు ఆగమేఘాల మీద హరీష్ రావుతో కేసీఆర్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు వీరి భేటీ సందర్భంగా కవిత అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ పెడుతుందన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో వీరి ఇరువురి మధ్య ఆ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసిన తర్వాత హరీష్‌రావు కేసీఆర్‌ను మూడుసార్లు కలిశారు. గత వారం రోజుల క్రితం రెండుసార్లు కలిసిన ఆయన మళ్లీ బుధవారం కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత గురువారం కేసీఆర్ తో హరీశ్ రావు మూడున్నర గంటల పాటు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనే ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుసింది. నోటీసులు వచ్చాక విషయంపై ఆలోచిద్దామని హరీశ్ కు కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. వీరిద్దరికి కమిషన్ నోటీసులు ముట్టడంతో.. బుధవారం మరోసారి భేటీ అయ్యారు.
కాగా, కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ చేస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్, హరీశ్ రావులతో పాటు నాడు ఆర్థికమంత్రిగా ఉన్న నేటి మల్కాజీగిరి బిజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావు, ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ ఉన్నారు. దీంతో జూన్ 5న కేసీఆర్, 6న హరీశ్‌రావు, 9న ఈటెల రాజేందర్ విచారణకు హాజరుకావాల్సిందిగా కమిషన్ నోటీసుల్లో పేర్కొంది.