ముగ్గురు ఐపీఎస్‌లకు కేంద్రం ఆదేశాలు
రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రహదారి భద్రత అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న అంజనీ కుమార్, తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, కరీంనగర్ పోలీసు కమీషనర్ అభిషేక్ మహంతిని ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అఖిల భారత సర్వీసు అధికారులను రెండు రాష్ట్రాలకు డీఓపీటీ కేటాయించింది. ఈ కేటాయింపులను వ్యతిరేకిస్తూ 10 మంది ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌లు అప్పట్లో క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ అంశంపై డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేసింది. విభజన సమయంలో నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని వీరి అభ్యర్థనలను పరిశీలించాలని గత ఏడాది జనవరిలో హైకోర్టు తీర్పు వెలువరించింది. 2024 మార్చిలో ఖండేకర్ కమిటీని నియమించించారు. ఈ కమిటీ సిఫార్సుల మేరకు గత అక్టోబరులో కొందరు ఐఏఎస్‌లను ఏపీకి పంపించారు. ఇప్పుడు మరో ముగ్గురు ఐపీఎస్‌లను ఏపీలో రిపోర్ట్ చేయాలని హోంశాఖ ఆదేశించింది.