తొట్టెంపూడి వేణు సినీ నటుడితో సహా మరో నలుగురిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. వేణు తెలియని వారుండరు. ‘స్వయంవరం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు వేణు. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ‘ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్’ సంస్థలో వేణు ప్రతినిధిగా ఉన్నారు. ఈ సంస్థ గతంలో ఉత్తరాఖండ్‌లో జల విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను తెహ్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీహెచ్‌డీసీ) ద్వారా దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్‌ను హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రిత్విక్ ప్రాజెక్ట్స్, స్వాతి కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాయి. అయితే, స్వాతి కన్‌స్ట్రక్షన్స్ సంస్థ మధ్యలోనే తప్పుకోవడంతో 2002లో రిత్విక్ సంస్థ పనులు మొదలుపెట్టింది.
ఆ తర్వాత ప్రోగ్రెసివ్, టీహెచ్‌డీసీ మధ్య వివాదం తలెత్తి ఢిల్లీ హైకోర్టుకు చేరింది. ఈ క్రమంలో రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేశారు. దీంతో ఆ సంస్థ ఎండీ రవికృష్ణ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు.