ప్రాబ్లమ్ ఏదైనా.. ఒక్కటే మాట
కేబినెట్ సబ్‌కమిటీ
ఇప్పటికే 12 సబ్ కమిటీలు
మంత్రులకు దొరకని తీరిక
కమిటీకి 8 నెలల సమయం
ప్రాబ్లమ్ ఏదైనా సొల్యూషన్ మాత్రం… కేబినెట్ సబ్ కమిటీలతోనే అంటోంది అధికార కాంగ్రెస్. కాదుకాదు… సబ్ కమిటీలే అసలు ప్రాబ్లమ్ అంటోంది బీఆర్ఎస్. దీంతో తెలంగాణలో రాజకీయాల్లో ఇప్పుడు సబ్‌కమిటీల వ్యవహారం చర్చనీయాంశమవుతున్నతి. తాజాగా ఉద్యోగుల సమస్యల కోసం అంటూ డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో మరో సబ్ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇది 12వ సబ్‌కమిటీ.
ఈ పది నెలల పాలనలో ఇప్పటివరకు 12 కేబినెట్ సబ్-కమిటీలను వేసింది. జీవో 317పై సబ్ కమిటీ, కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై మరో సబ్ కమిటీ, అలాగే ఆరు గ్యారంటీలపైనా, జలవనరులపైనా, ధరిణి సమస్యలపైనా, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి.. ఇలా ఇప్పటివరకు 12 సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలన్నీ ప్రజా సమస్యల పరిష్కారానికే అంటోంది.
ఏం చేస్తున్నారు..?
కొత్త ప్రభుత్వం కొలువుదీరి 10 నెలలు పూర్తయింది. ఆరు గ్యారెంటీల లెక్క ఇంకా తేలలేదు. ఆ గ్యారెంటీలన్నిటికీ రేషన్ కార్డ్ తో ముడిపెట్టడంతో వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారింది. పోనీ కొత్త రేషన్ కార్డ్ లు ఇస్తున్నారా అంటే అదీ లేదు. రేషన్ కార్డ్ ల కోసం ఏకంగా ఓ కమిటీ వేశారు. అది కూడా ప్రభుత్వం ఏర్పాటైన 8 నెలల తర్వాత. కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి అర్హతలు, విధి విధానాల రూపకల్పనకు ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్‌కమిటీని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీకి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. నిజానికి, సబ్‌కమిటీల పాలనగా మారింది. సంప్రదింపుల పేరుతో నెట్టుకొస్తున్న కాంగ్రెస్ సర్కార్ ప్రజోపయోగ నిర్ణయాలను వేగంగా తీసుకొని, అమలుచేయాల్సిన రాష్ట్రప్రభుత్వం ‘క్యాబినెట్ సబ్ కమిటీ’ల పేరుతో కాలక్షేపం చేస్తున్నది. కీలకమైన అంశాలపై కమిటీలు వేసి, సంప్రదింపుల పేరుతో నెలలపాటు నెట్టుకొస్తున్నది. నేరుగా నిర్ణయం తీసుకోకుండా నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇదే తంతు. ఒక్కో మంత్రి నాలుగైదు కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు.
ప్రతి నిర్ణయానికి క్యాబినెట్ సబ్ కమిటీలు
రాష్ట్ర ప్రభుత్వం ‘క్యాబినెట్ సబ్ కమిటీ’ల పేరుతో కాలక్షేపం చేస్తున్నది. కీలకమైన అంశాలపై కమిటీలు వేసి, సంప్రదింపుల పేరుతో నెలలపాటు నెట్టుకొస్తున్నది. నేరుగా నిర్ణయం తీసుకోకుండా నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇదే తంతు. ఒక్కో మంత్రి నాలుగైదు కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. దీంతో ఆయా శాఖల అధికారులు, మంత్రుల పేషీల్లోని అధికారులు ఏ సమావేశం ఎప్పుడు జరుగుతుందో తెలియక తికమకపడుతున్నారు. మంత్రుల వ్యక్తిగత, శాఖాపరమైన కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ, కమిటీల సమావేశాలు ఏర్పాటు చేయటానికి జీఏడీ అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. పోనీ ఈ కమిటీలతో ఇప్పటివరకు ఒక్క సమస్యకైనా శాశ్వత పరిష్కారం దొరికిందా? అని ప్రశ్నిస్తే లేదనే సమాధానమే వస్తున్నది. దీంతో క్యాబినెట్ సబ్‌కమిటీల చిత్తశుద్ధిపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా క్యాబినెట్ సమావేశంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెంటనే సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు దాని అమలుపై దృష్టిసారిస్తారు. విధివిధానాలు రూపొందించుకొని, సీఎం దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా అమలు చేస్తుంటారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాల అమలుపైనా మళ్లీ సబ్ కమిటీ వేస్తున్నారు. దీంతో ముందుగా అధికారులు వివరాలు సేకరించి, సదరు మంత్రితో చర్చించి, ఆ అంశాలను క్యాబినెట్ సబ్‌కమిటీ ముందు ఉంచాల్సి వస్తున్నది. కమిటీ కొన్నిసార్లు సమావేశమై చర్చించి, నిర్ణయం తీసుకొని, సీఎం వద్దకు ఫైల్ పంపుతున్నది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావటానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి.
10 నెలల కిందట ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో వేసిన కమిటీలే ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న అంశాలపై కూడా ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చిన దాఖలాలు కనిపించటం లేదు. ఉదాహరణకు 2008 డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఇప్పటికే అమలవుతున్న విధానాన్ని పరిశీలించి, విధివిధానాలు ఖరారు చేయాలని సబ్‌కమిటీని ఏర్పాటుచేశారు. ఇప్పటికే విద్యాశాఖ వద్ద సంపూర్ణంగా వివరాలు ఉన్నాయి. వాటిని అధ్యయనం చేసి నెల రోజుల్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నా.. 6 నెలలుగా కాలయాపన చేస్తూనే ఉన్నారు.
సీఎం సబ్‌కమిటీ ఉన్నట్టేనా?
విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సబ్‌కమిటీ ఏర్పాటైంది. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క ఇందులో సభ్యులుగా ఉన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని చెప్పారు. కానీ ఈ కమిటీ ఏం పనిచేస్తున్నదో తెలియని పరిస్థితి.
ప్రజాపాలన కమిటీ పనిచేస్తున్నదా?
ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో ఐదు గ్యారంటీల అమలుకు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. వీటి అమలుకు ఈ ఏడాది జనవరి 8న క్యాబినెట్ సబ్‌కమిటీని నియమించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇందులో సభ్యులుగా ఉన్నారు. చివరిసారిగా ఫిబ్రవరి 1న సీఎంతో కమిటీ సమావేశమైంది. ఆ తర్వాత కమిటీ ఊసే లేదు. కమిటీ కొనసాగుతున్నదా? అన్నదానిపైనా స్పష్టత లేదు. ఒకవేళ ఉంటే ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులు, అర్హులందరికీ అందుతున్నాయా? లేవా? కొత్త దరఖాస్తుల ప్రక్రియ వంటి అంశాలపై ఎందుకు రివ్యూ చేయడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వరుస భేటీలు.. కనిపించని ఫలితాలు
జీవో 317, జీవో 46 అమలుపై మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో మంత్రు లు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో ఒక కమిటీని ఫిబ్రవరిలో నియమించింది. కమిటీ ఇప్పటివరకు అనేకసార్లు భేటీ అయ్యిం ది. చర్చల మీద చర్చలు జరుగుతున్నా ఇప్పటివరకు ఒక్క నిర్ణయం కూడా వెలువడలేదు. దీంతో ఉద్యోగుల ఉసూరుమంటున్నారు. డీఎస్సీ 2008లో నష్టపోయిన అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. త్వరలో ఉద్యోగాల్లో చేరబోతున్నామని అభ్యర్థులు భావించగా ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. జీవో 317, 46పై ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్‌కమిటీకే విధివిధానాల ఖరారు బాధ్యత అప్పగించింది. అప్పటి నుంచి విద్యాశాఖ అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా ఉన్నా.. సబ్‌కమిటీ సమావేశాలు జరుగుతున్నాయే తప్ప ఈ విషయాన్ని తేల్చటం లేదు. మరోవైపు ఉద్యోగాలు ఇచ్చే అంశం ఏమైందని పదేపదే న్యాయస్థానం అడ్వకేట్ జనరల్‌ను అడుగుతున్నా, సాగదీత ధోరణి కనిపిస్తున్నది. చివరగా ఈనెల 27లోగా ప్రక్రియ పూర్తిచేస్తామని ఏజీ గడువు తీసుకున్నారు. ఆలోగానైనా పూర్తి చేస్తుందా? అని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
భరోసా.. సాగదీత
రైతు భరోసా అమలు కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో సబ్‌కమిటీని జూలైలో ప్రభుత్వం నియమించింది. 15 రోజుల్లోగా ఆ సబ్‌కమిటీ నివేదిక ఇస్తుందని సర్కారు తెలిపింది. ఈ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించి, అమలు చేస్తామని సర్కారు పెద్దలు ప్రకటించారు. మంత్రులు కూడా హడావుడిగా జిల్లాల పర్యటనలు, వరుస సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత దాని ఊసే లేకపోయింది. రైతు రుణమాఫీని ప్రచారం చేసుకొని, ఈ సీజన్ రైతుభరోసా వేయకుండా ఎగ్గొట్టింది.
ఇంకా చాలా..?
షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణపై మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. ఇందులో మంత్రులు దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. ఈ కమిటీ సమావేశాల ఊసే లేదు. తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం తుదిరూపుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ వివిధ వర్గాల వారితో చర్చలు జరుపుతుందని అప్పట్లో చెప్పారు. కానీ ఇప్పటివరకు తేల్చిందేమీ లేదు. ఇలా ప్రభుత్వం వేసిన కొన్ని సబ్‌కమిటీలు అసలు ఊసులోనే లేవు. కొత్త రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి, జల వనరుల రక్షణకు.. ఇలా ఇబ్బుడిముబ్బుడిగా సబ్‌కమిటీలను నియమించింది.
ఇక, కొన్ని కమిటీలు సమాశాలు నిర్వహిస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇలా క్యాబినెట్ సబ్ కమిటీల పేరుతో కాలయాపన తప్ప సమస్య పరిషారం కావటం లేదని అటు ప్రజలు, ఇటు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ‘సమగ్రంగా సంప్రదింపులు జరుపుతున్నాం’ అనే వంకతో నెలలపాటు సమయం వృథా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఒక్కో మంత్రికి నాలుగైదు కమిటీల్లో చోటు కల్పించటంతో.. వారికి కూడా పనిఒత్తిడి పెరిగిందని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కమిటీలను వేగవంతం చేసి తుది నివేదికలు తెప్పించుకోవాలని కోరుతున్నారు. భవిష్యత్తులో అత్యంత కీలకమైన అంశాలపై తప్ప మంత్రులతో కమిటీలు వేయొద్దని, ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించాలని పేర్కొంటున్నారు.
అయితే, రాష్ట్ర క్యాబినెట్ ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని అమలు కావటం లేదు. సమావేశం తర్వాత ఫలానా నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ఘనంగా చెప్పకుంటున్నా.. అమల్లో మాత్రం మందగమనం కనిపిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించి, వేగంగా పూర్తిచేసే వ్యవస్థ లేకపోవటమే ఇందుకు కారణమని అంటున్నారు. కీలక నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం వేసి కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మార్చి 12న జరిగిన క్యాబినెట్ సమావేశంలో.. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. గ్రామ సభలు పెట్టి దరఖాస్తులపై చర్చించి, జాబితా రూపొందిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్క ఇల్లుకు కూడా నిధులు విడుదల కాలేదు. మహిళా సంఘాల బ్రాండింగ్ కోసం ఓఆర్‌ఆర్ చుట్టూ 30 ఎకరాల స్థలం కేటాయించాలని నిర్ణయించినా ఇప్పటివరకు అమలు కాలేదు. జూన్ 21న జరిగిన క్యాబినెట్ సమావేశంలో అందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. కానీ.. ఇప్పటికీ పూర్తికాలేదు. రూ.18 వేల కోట్లతో రుణమాఫీ చేశామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అంటే ఇంకా రూ.13 వేల కోట్ల రుణమాఫీ కాలేదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ జూలై 15లోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని, అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ జరుపుతామని చెప్పారు. కానీ.. నివేదిక అందలేదు. అసెంబ్లీలో చర్చించలేదు.
ఆగస్టు 1న జరిగిన క్యాబినెట్ సమావేశంలో.. కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించిన విదివిధానాల రూపకల్పన బాధ్యతలను సబ్ కమిటీకి అప్పగించారు. రేషన్‌కార్డులకు కొత్తగా అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సీఎం గురువారం ఆదేశించగా, ఆరోగ్యశ్రీ కార్డులపై స్పష్టత రాలేదు. క్రీడాకారులు నిఖత్ జరీన్, సిరాజ్‌కు గ్రూప్-1 ఉద్యోగాలు ఇస్తామని నిర్ణయించగా, సిరాజ్‌కు ఇప్పటివరకు ఉద్యోగం ఇవ్వలేదు.
ఇప్పుడు మళ్లీ కమిటీ
అపరిష్క్రృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యల అధ్యయనం, పరిష్కార మార్గాల అన్వేషణ కోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను చైర్మన్ గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రబాకర్ సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఈ మేరకు గురువారం బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టీజీవో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమస్యలపై వారితో చర్చలు జరిపారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం 51 అంశాలపై ఉద్యోగ జేఏసీ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా సబ్ కమిటీని ప్రకటించారు.