బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణలపై ప్రజలకు వివరించాలి
– విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలి
– స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలపైనే దృష్టి
– సమస్యలు ఉంటే నేరుగా నాతో చెప్పండి
– సిఎల్పి భేటీలో ఎమ్మెల్యేలకు సిఎం రేవంత్ దిశానిర్దేశం
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కొత్త, పాత నేతలు సమన్వయంతో సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో కొత్త పాత నేతలు సమన్వయంతో సాగితేనే స్థానిక సంస్థల్లో పాగా వేయగలమని సూచించారు. కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా బీసీ కులగణన చేపట్టామని, ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతా చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టేందుకు ఉత్తర తెలంగాణలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేద్దామని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవాలని, ప్రతీ స్థాయిలో విజయాన్ని సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. అలాగే సమస్యలపై ఎమ్మెల్యేలు నేరుగా తనను కలుసుకోవచ్చని అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డిలో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో కాంగ్రెస్ బలాన్ని పెంపొందించేందుకు గ్రాణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఏకగ్రీవ విజయం సాధించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హాల అమలుకు నిదర్శనంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, వివిధ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడం, నిధుల కేటాయింపు కోసం తక్షణమే సంబంధిత మంత్రులను కలవాలని సూచించారు. స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
ఇది పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా ఉండేలా, బీసీ వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. బీసీ నాయకత్వాన్ని ముందుకు తేవడానికి, వారికి అధికారంలో మద్దతుగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల విజయమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో మరింత దృఢంగా నిలిచేలా చేస్తుందని, అందుకే ప్రతి నియోజకవర్గం స్థాయిలో సమర్థవంతమైన ఎన్నికల ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రజలకు చేరువగా ఉంటూ ప్రభుత్వ పథకాలను గట్టిగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ విజయానికి శ్రమించాలని, ముఖ్యంగా గ్రాణ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. బీసీ కులగణను శాస్త్రీయంగా చేపట్టామని, దీనిపై ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గాల స్థాయిలోనే కౌంటర్ అటాక్ చేయాలని సూచించారు.
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది..
అదే విధంగా ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, చెప్పామని, దానిని అమలు చేసి చూపామన్నారు. ఎస్సీ వర్గీకరణను వివరించేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఈ మేరకు సమావేశంలో నిర్ణయించారని సమాచారం. దీంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు ఏమైనా సమస్యలుంటే తన వద్దకు వచ్చి నేరుగా చెప్పుకోవచ్చని సీఎం చెప్పారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, గ్యారెంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలపై ప్రతిపక్షాలు లేని పోని అపోహలు సృష్టిస్తున్నాయని, అదే స్థాయిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కౌంటర్ ఇవ్వాలని సూచించినట్టు సమాచారం.
ఇదలావుంటే ఎంసీహెచ్‌ఆర్డీలో జరిగిన సీఎల్పీ సమావేశానికి బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, గూడెం మహిపాల్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, సంజయ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరు కాలేదు. అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేయడం, కేసు సుప్రీంకోర్టులో ఉండటం.. టెక్నికల్ గా ఏ సమస్యా రాకుండా ముందు జాగ్రత్త చర్యలగా వీరు గైర్హాజరైనట్టు సమాచారం.స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దాదాపు ఐదున్నర గంటల పాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.